సమ్మె ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలి

మాట్లాడుతున్న యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ

ప్రజాశక్తి రంపచోడవరం

అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా పలు డిమాండ్లపై జరిగిన ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఆధ్వర్యాన రంపచోడవరంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణా తరగతుల్లో సుబ్బరావమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీలు 42 రోజుల పాటు విరోచిత పోరాటం చేసి అనేక డిమాండ్‌లు సాధించుకోవడం జరిగిందని తెలిపారు. సమ్మె కాలంలో మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు యూనియన్‌ తరుపున వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఐసిడిఎస్‌, ఫైనాన్స్‌ అధికారులతో మంత్రి ఫోన్‌ ద్వారా మాట్లాడారని, తక్షణం సమ్మె కాలపు సమయానికి వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని బొత్స హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జిఓ నెంబరు 47 సవరణ, కార్యకర్తలకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌గా రూ.50 వేల నుంచి రూ.లక్షా 20వేలు, హెల్పర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచడం, 42 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడం, అంగన్‌వాడీలు మృతి చెందితే మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వడం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రధాన మంత్రి బీమా పథకం అమలు, సాధికారత సర్వేలో ఉద్యోగులు అనే పదాన్ని తొలగించి అంగన్‌వాడీలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడటం, సమ్మె కాలంలో అంగన్‌వాడీలపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, అధికారులు, యూనియన్‌ నాయకులతో కమిటీ వేసి వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీల పెంపు, నాలుగు యాప్‌లను ఒకే యాప్‌ కింద మార్పు, రాష్ట్ర వ్యాప్తంగా వున్న 164 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ, సెలవులు, అర్హత కలిగిన అంగన్‌వాడీలకు ఇళ్ల స్థలాలు మంజూరు, అంగన్వాడీ హెల్పర్లుకు వర్కర్లుగా ప్రమోషన్‌ తదితర సమ్మె కాలంలో ప్రభుత్వం అంగీకరించిన అన్ని అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి బొత్సను కోరినట్లు తెలిపారు. యూనియన్‌ రంపచోడవరం జిల్లా అధ్యక్షురాలు ఎం.రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రంపచోడవరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వాణిశ్రీ, పి.వెంకట్‌, జిల్లా ఉపాధ్యక్షులు పి.రామరాజు, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నిర్మల, నాయకులు కె.రామలక్ష్మి, కె.రాణి, కె.మంగయ్యమ్మ, కె వెంకట లక్ష్మి, బేబి, ప్రసూన, కె నాగదేవి, అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️