సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : పాదయాత్రలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. నిరవధిక సమ్మె విచ్ఛిన్నానికి కుట్ర పన్నుతోంది. పోరాటాన్ని అణచివేసే చర్యలకు పూనుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ నుంచి మండల స్థాయి అధికారుల వరకు బెదిరింపులు, అంగన్వాడీ కేంద్రాల తాళాలను విరగ్గొట్టడం వంటి దిగజారుడు చర్యలకు పాల్పడ్డారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టని పాలకులు, అధికారులు… హెచ్చరికలు, బెదిరింపు చర్యలకు దిగడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, సిడిపిఒలు, జిల్లా అధికారులతో కలెక్టర్‌ నాగలక్ష్మి గురువారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను సిడిపిఒల ఆధ్వర్యంలో గురువారమే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌… ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, సిడిపిఒలను ఆదేశించారు. సంక్షేమ కార్యదర్శులు, మహిళా పోలీసులు, విఆర్‌ఒలు తదితర సచివాలయ సిబ్బందిలో ఒక్కొక్కరికి ఒక్కో సచివాలయం బాధ్యతలు అప్పగించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో తెరవాలని, పిల్లలను ఆయా కేంద్రాలకు రప్పించాలని ఆదేశించారు. దీంతో ఎక్కడికక్కడ కమిషనర్లు, ఎంపిడిఒలు సమావేశాలు ఏర్పాటుచేసి, ఆగమేఘాలపై అంగన్వాడీ కేంద్రాలపై పడ్డారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. విజయనగరం అర్బన్‌ ఐసిడిఎస్‌ పరిధిలో మూడు సెక్టార్లలో ఏడు కేంద్రాలను తెరిపించారు. గరివిడి మండలంలో 82 కేంద్రాల తాళాలను బద్దలుగొట్టారు. నెల్లిమర్ల మండలం సతివాడ కేంద్రాన్ని తెరిచారు. గజపతినగరం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 272 సెంటర్లకు గాను 34 అంగన్వాడీ కేంద్రాలను అధికారులు బలవంతంగా తెరిచారు. వంగర మండలంలో మొత్తం 69 అంగన్వాడీ సెంటర్లకు గాను గురువారం మధ్యాహ్నానికి 10 సెంటర్లు తెరిపించారు. బాడంగి మండలంలో 20 కేంద్రాలను అధికారులు బలవంతంగా తెరిచారు. బొబ్బిలి : బొబ్బిలి మున్సిపాలిటీలో 104 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 46 కేంద్రాల తాళాలను ఐసిడిఎస్‌ సిబ్బంది, అధికారులు, సచివాలయ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నట్లు పిఒ విజయలక్ష్మి తెలిపారు. బొబ్బిలి రూరల్‌లో డొంగురువలస, విజయపురి గ్రామాల్లో కేంద్రాలను బలవంతంగా తెరిచారు.చీపురుపల్లి : తాళాలు పగలుగొట్టి అంగన్‌వాడీ సెంటర్లను స్వాధీనం చేసుకోవాలని ఎంపిడిఒ జి.గిరిబాల సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎంపిడిఓ కార్యాలయంలో అత్యవసరంగా సచివాలయ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సచివాలయ సిబ్బంది, విఆర్‌ఒలు ఆగమేఘాలపై 80 అంగన్‌వాడీ సెంటర్లకు వెళ్లి తాళాలను పగలుగొట్టారు. కార్యక్రమంలో పిఒ కెవిఎస్‌ఎన్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.రేగిడి : తహశీల్దార్‌ సుదర్శన్‌రావు, ఎంపిడిఒ శ్యామలకుమారి, సచివాలయ ఉద్యోగులు వెళ్లి అంగన్వాడీలు కార్యకర్తలు లేకుండా తాళాలు పగులుగొట్టి, సరుకులు స్వాధీనం చేసుకున్నారు. రాజాం ఐసిడిఎస్‌ సెక్టార్‌ పరిధిలో 85 కేంద్రాలుండగా, 12 కేంద్రాలను తెరిచారు.అడ్డుకున్న తల్లిదండ్రులుజామి : మండల కేంద్రమైన జామిలో అంగన్వాడీ కేంద్రాలు తెరిచేందుకు ప్రయత్నించిన అధికారులకు ఊహించని షాక్‌ తగిలింది. జామిలో అంబేద్కర్‌, అల్లువీధి అంగన్వాడీ కేంద్రాలను ఎంపిడిఒ సతీష్‌ ఆధ్వర్యంలో బలవంతంగా తెరిచేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అంబేద్కర్‌ పాఠశాల ప్రాంగణంలోని కేంద్రాన్ని పోలీసుల పహారాలో బలవంతంగా తెరిచారు. అల్లువీది పాఠశాలలో కేంద్రాన్ని తెరిచేందుకు వెళ్లగా చిన్నారులు తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అధికారులు ఎంత నచ్చజెప్పినా తల్లిదండ్రులు వెనుకడుగు వేయలేదు. ఆయా, టీచర్‌ వచ్చేంత వరకు కేంద్రాన్ని తెరవనీయబోమని అడ్డుకున్నారు. తెరిచేందుకు వెళ్ళిన వారిలో ఇఒపిఆర్‌డి శ్రీదేవి, సూపర్‌ వైజర్‌, సచివాలయ సిబ్బంది ఉన్నారు. మండలంలో 35 కేంద్రాలను అధికారులు బలవంతంగా తెరిచారు. నిరసన శిబిరాల వద్దకు అధికారులుకొత్తవలస : కొత్తవలసలో అంగన్వాడీలు చేపడుతున్న నిరసన శిబిరం వద్దకు సిడిపిఒ, సూపర్వైజర్లు వచ్చారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలివ్వాలని కోరారు. తాళాలిచ్చే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో అంగన్వాడీలు బదులిచ్చారు. చేసేది లేక అధికారులు వెనుదిరిగారు.భోగాపురం : భోగాపురంలో అంగన్వాడీ కేంద్రాల తాళాలు అందజేయాలని ఎంపిడిఒ అప్పలనాయుడు కోరగా, అంగన్వాడీలు నిరాకరించారు. దీంతో భోగాపురంలో బొల్లువీధి వద్ద పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రం తాళాలను పంచాయతీ ఇఒ రామకృష్ణనాయుడు హెచ్‌ఎం వద్ద నుంచి తీసుకొని తెరిచారు. ప్రాజెక్టు పరిధిలో నాలుగు కేంద్రాలను బలవంతంగా తెరిచారు.

➡️