సాగు పట్టాలు మంజూరు చేసి ఆదుకోండి

సాగుదారులతో కలిసి భూములను పరిశీలిస్తున్న అప్పలరాజు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు

ప్రజాశక్తి -నక్కపల్లి :మండలంలోని దోసలపాడు అగ్రహారం,చీడిక రెవిన్యూలో నిరుపేద దళితులు, యాదవుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం పేదల సాగులో ఉన్న భూములను సాగుదారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి చెందిన నిరుపేద దళితులు, యాదవుల గత30ఏళ్లుగాప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి ఆ భూముల్లో ఉన్న తుప్పలు, డొంకలు నరికి సాగు భూములుగా తయారుచేసి ,వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి జీడి, మామిడి తోటలు వేసుకుని వచ్చిన ఫల సాయంతో జీవనం సాగిస్తున్నారని తెలిపారు .గతంలో రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది లబ్ధిదారులకు భూమి పట్టాలు ఇచ్చారన్నారు. పట్టాలు పొందని లబ్ధిదారులు అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నేటికీ పేదలకు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే స్థానిక తహశీల్దార్‌కు పట్టాల కోసం పేదలు దరఖాస్తు చేశారన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి సాగు భూములను సర్వే చేయించి, నిరుపేద సాగుదారులను గుర్తించి పట్టాలు ఇవ్వాలని కోరారు . సాగుదారులకు పట్టాలు ఇవ్వకపోవడం వలన ప్రభుత్వం అందించే రైతు భరోసా, పీఎం కిసాన్‌, పంటరుణాలు, పంటలబీమా వంటి పథకాల లబ్ది పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పేదల పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్‌, సాగుదారులు పి.రమణ, ఎం.కల్యాణం, కె.ఎతిమాని, జీ.అప్పారావు, చిన్నారావు పాల్గొన్నారు.

సాగుదారులతో కలిసి భూములను పరిశీలిస్తున్న అప్పలరాజు

➡️