సామాజిక న్యాయం కోసం సంతకాల సేకరణ

Nov 30,2023 00:37

ప్రజాశక్తి-హనుమంతునిపాడు దళితుల ఆత్మగౌరవం, ఉపాధి, సంక్షేమం, దళిత వాడల అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండల కేంద్రంలో రాష్ట్రపతికి పంపుతున్న లేఖపై సంతకాల సేకరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో నేటికీ దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరగటం ఈ దేశ దురవస్థను తెలియజేస్తోందన్నారు. మణిపూర్‌ లాంటి ఘటన యావత్‌ భారతదేశం తలవంచుకునేలా చేసిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసిందని, రిజర్వేషన్లు అమలు చేయకుండా దళితుల అభివృద్ధికి అడ్డుగా నిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ మూలాలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని, మనువాదాన్ని ముందుకు తీసుకొస్తూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అనేక సవరణలు చేస్తూ రూపాన్ని మారుస్తున్నాదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్రాస్‌, ఉన్నావ్‌, కతువా, బిల్కిస్‌ బాను ఘటనలు ప్రపంచ చరిత్ర పటంలో భారత్‌ తలవంచుకునేలా చేశాయని అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా చేయడంతో వారు వలస పోతున్నారని అన్నారు. అసైన్డ్‌ భూములను పేదలకు కాకుండా పెద్దలకు కట్టబెట్టేందుకు 9/7 ఆక్ట్‌ను నిర్వీర్యం చేశారని అన్నారు. పేదల భూములను, ఇళ్ల స్థలాలను, శ్మశానాలను అన్యాక్రాంతం చేస్తున్న పెత్తందారులకు రక్షణ కల్పించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా ద్రోహం చేస్తున్నారని అన్నారు. దళితులు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను రాష్ట్రపతికి తెలిపేందుకు యావన్మంది ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ నాయకులు కత్తి యోబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములు, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు అన్డ్రా వినరు, సిఐటియు మండల నాయకులు సిహెచ్‌ ఏసు, లక్ష్మీదేవి, చాముండేశ్వరి, రూతమ్మ, గురవమ్మ, ఎలిజిబెత్‌ రాణి పాల్గొన్నారు.సంతకాలు సేకరిస్తున్న సంఘ నాయకులు

➡️