సిఎఎను రద్దు చేయాలి

Mar 26,2024 21:40

మత ప్రాతిపదికన పౌరసత్వం రాజ్యాంగ వ్యతిరేకం

సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి

వామపక్ష, లౌకిక పార్టీల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌  : దేశాన్ని బలహీనపరిచే సిఎఎ చట్టం అమలును రద్దు చేయాలని, బిజెపి మోడీ విధానాలకు మద్దతు తెలిపే వైసిపి, టిడిపి జనసేన పార్టీలను వ్యతిరేకించాలని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం. కృష్ణమూర్తి అన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ మతోన్మాదపు చట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం స్థానిక చర్చి జంక్షన్‌ నుండి కాంప్లెక్స్‌ మెయిన్‌ రోడ్డు మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. నాటి బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లి క్షమా భిక్షకు మొరపెట్టుకున్న బిజెపి దేశభక్తులు నేడు దేశభక్తి కోసం మాట్లాడుతుండడం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. పౌరసత్వ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని, ఈ చట్టం దేశంలోని ముస్లింల సమస్య కాదని, పౌరులందరి సమస్య అని తెలిపారు. ఇది దేశ ఐక్యతకు, లౌకిక, ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ప్రమాదానికి పేర్కొన్నారు. అన్ని మతాలు, జాతులు కలిసి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాయని, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కలిసి దేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేసి నిరంకుశ హిందూ మత రాజ్యంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని అన్నారు. ఇంత దుష్ట పన్నాగం పన్ని దేశ రాజ్యాంగాన్ని బలహీనపరిచే సిఎఎ చట్టం అమలును అడ్డుకోవాల్సిన వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్రంలో బిజెపి వద్ద మోకరిల్లాయని అన్నారు. ఇది రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి అని మండిపడ్డారు. మత ప్రాతిపదికన పౌరసత్వం అంటే ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలో ఉన్న మన దేశపౌరులకు ప్రమాదం వస్తుందని నాయకులు తెలిపారు. అందుకు ఈ చట్టాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులైన మన అందరి పైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మధరావు, దుర్గరావు, కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎం.సింహాచలం, సిపిఐ న్యూ డెమోక్రసి నాయకులు నర్సింగరావు, రమణి, సిపిఐ లిబరేషన్‌ నాయకులు పి. సంఘం, సిపిఎం నాయకులు వై.మన్మధరావు, వి. ఇందిరా, జి.వెంకటరమణ, రెడ్డి ఈశ్వరరావు, రెడ్డి లక్ష్మునాయుడు, బి.సూరిబాబు, గవర వెంకటరమణ, పి.రాజశేఖర్‌, డి.పండు పాల్గొన్నారు.

➡️