స్టాటర్లు, కాఫర్‌ వైర్లు దొంగలిస్తున్న దుండగులు.. లబోదిబోమంటోన్న రైతులు

Feb 8,2024 15:16 #Kadapa, #rythu

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : పంటలకు సాగు నీరు అందించేందుకు వ్యవసాయ భూముల్లో సాగు నీటి కోసం మోటర్లుకు అమర్చిన స్టాటర్లు, విద్యుత్‌ ట్రాన్స్‌ ఫారంలోని కాఫర్‌ వైర్లును గుర్తు తెలియని దుండగులు దొంగలిస్తున్నారని.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లె మండలం పరిధిలోని చింతలమడుగుపల్లె, కుమ్మరాంపల్లె, అలిరెడ్డిపల్లెతో పాటు ఆయా గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఉన్న స్టాటర్లు, వైర్లు గత కొద్ది రోజులుగా నుండి చోరికి గురి అవుతున్నాయి. అయితే రైతులు ఎవరికి చెప్పుకోలేక మౌనంగా ఉండి పోతుండడంతో గుర్తు తెలియని వ్యక్తులు మరింత రెచ్చి పోతున్నట్లు రైతులు వాపోతున్నారు. బుధవారం అర్థరాత్రి చింతలమడుగుపల్లె సమీపంలో ఉన్న రాజా సాహెబ్‌ భూమిలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ ఫారంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని విలువైన రాగి తీగను ఆయిల్‌ ను దోచుకెళ్లినట్లు రైతు రాజా సాహెబ్‌ వాపోయాడు. గతంలో కూడ విద్యుత్‌ స్తంభాలు కూడ దొంగలించినట్లు రైతు వాపోయాడు. గురువారం పొలం వద్దకు వెళ్లిన రైతు రాజా సాహెబ్‌ ట్రాన్స్‌ పార్మర్‌ చోరీకి గురైనట్లు గుర్తించి విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ ఫారంను దుండగులు పగుల కొట్టి రాగి తీగ అపహరించడంతో దాదాపు 50 వేలు ఖర్చు రైతులపై అదనపు భారం పడుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రాత్రి సమయంలో దుండగులు పంట పోలాల్లోకి వెళ్లి స్టాటర్లును కూడ దొంగలిస్తున్నట్లు రైతు మహమ్మద్‌ దర్బార్‌ చెప్పారు. ఇటివల కాలంలో చింతలమడుగుపల్లె సమీపంలో తోటలను సాగు చేసిన నిమ్మకాయల మహమ్మద్‌ దర్బార్‌, చావలి సంటెన్న, బాష, గండు గంగయ్య అనే రైతులకు చెందిన స్టాటర్లు, కెబుల్‌ వైర్లులను గుర్తు తెలియని దుండగులు దొంగలించినట్లు వారు వాపోయారు. ఒక్క స్టాటర్‌ కొనుగొలు చేయాలంటే దాదాపు 10 వేలు అవుతుందని రైతులు అంటున్నారు. రాత్రి సమయంలో స్టాటర్లు చోరికి గురి అవుతుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు లబోదిబోమంటున్నారు. పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు భద్రత కరువైనట్లు రైతులు అంటున్నారు. కన్నేశారాంటే కటిక చీకట్లో చోరీ చేయాల్సిందే అన్న రీతిలో విద్యుత్‌ వైర్లు, కాఫర్‌ వైర్లు, స్టాటర్లును దుండగులు దిగమింగేస్తున్నారు. ప్రాణాంతకమని తెలిసినా విద్యుత్‌ వైర్లతో సయ్యాట లాడుతున్నారు. అర్ధరాత్రి మొదలు కోడి కూసే లోపు గప్‌ చుప్‌గా ఎత్తుకొని పోతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలకు లక్షలు పోసి పంట బాగుకు రైతులు పంట పోలాల్లో అమర్చుకున్న పరికరాలు దొంగలపాలు అవుతున్న అధికారుల్లో చలనం లేదని రైతులు చర్చించుకొంటున్నారు. స్టాటర్లు, కెబుల్‌ వైర్లు ఎత్తు కెళ్ళుతుండడంతో పొద్దున్నే తమ పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు బోర్ల వద్ద తెగిపోయిన విద్యుత్‌ వైర్లు, ఊడిపోయిన బోరు మోటార్లను చూసి ఆశ్చర్య పోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట స్టాటర్లు, వైర్లు చోరికి గురి అవుతుండడంతో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకొంటున్న రైతులకు నిద్ర లేని రాత్రులు తప్పడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

➡️