స్టాప్‌ లైన్‌ ఇ- చలానాలు రద్దు చేయాలి

Feb 26,2024 21:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : స్టాప్‌ లైన్‌ ఈ చలనాలు రద్దు చేయాలని రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టాప్‌ లైన్‌ వైలేషన్‌ పేరుతో ఆటో క్యాబ్‌ డ్రైవర్లపై విధిస్తున్న ఈ చలానాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇ – చలనాలు చెల్లించేందుకు ఎపి ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ ఈ చలానాల వెబ్‌సైట్‌లో అనుసంధానం చేయడంతో సమస్య మరింత జటిలమైందని, ఆర్‌టిఒ కార్యాలయానికి వెళ్లేంతవరకు పెనాల్టీ పడిందనే విషయం డ్రైవర్లకు తెలియజేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాప్‌లైన్‌ సీసీ కెమెరాలను క్రమబద్ధీకరించి ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లను జైల్లోకి పంపే క్రిమినల్‌ చట్టం బి ఎన్‌ ఎస్‌ 106 (1,2)ను రద్దు చేయాలని కోరారు. అనంతరం గ్రీవెన్స్‌లో డిఆర్‌ఒ అనితకు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో అంబేద్కర్‌ జంక్షన్‌ ఆటోస్టాండ్‌ అధ్యక్షులు వై.రామారావు, వై.భాస్కర్‌, సిహెచ్‌మోహన్‌, బి.రామారావు, పి.సాగర్‌, ఆనంద్‌ వై.అప్పారావు, కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️