26 నుండి ఆడుదాం ఆంధ్ర పోటీలు

క్రీడా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 26 నుండి ఫిబ్రవరి 10వ తేది వరకు 47 రోజులు పాటు నిర్వహించే ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ అంశంపై కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి సిఎం జగన్మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం సమీక్షించారు. గుంటూరు కలక్టరేట్‌ నుండి కలెక్టర్‌తోపాటు జెసి జి.రాజకుమారి, మేయర్‌ మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 567 గ్రామ, వార్డు సచివాలయాలు, 18 మండలాలు, 7 నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 244 క్రీడా ప్రాంగణాలను, 312 మంది పీఈటీలు, పీడీలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఎంపిక చేసినట్లు తెలిపారు. 1,24,972 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, 567 గ్రామ/వార్డు సచివాలయాల్లో 232 మైదానాలను గుర్తించామని, 22,453 క్రీడా పరికరాలు జిల్లాకు అందాయని, వీటిని గ్రామాలకు సరఫరా చేశామని వివరించారు. అనంతరం స్థానిక నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఏటుకూరులోని సత్యసాయి స్కూళ్ళలోని మైదానాల్లో ఆటల పోటీల నిర్వహణకు చేపట్టిన పనులను కలెక్టర్‌, జెసి, కమిషనర్‌, పరిశీలించారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో క్రీడలకు అవసరమైన ఆట స్థలాలతో పాటు మౌలిక వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమాల్లో ఆర్‌డిఒ పి.శ్రీఖర్‌, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️