Feb 13,2024 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  రవాణా రంగ కార్మికుల పాలిట శాపంగా మారిన క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 16న జరగనున్న సమ్మెలో రవాణా రంగ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్‌పిఅర్‌ భవనంలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా, సరుకు రవాణాలో లారీ, లగేజీ గూడ్స్‌, ఆటో, క్యాబ్‌ ,డ్రైవర్లది కీలకస్థానమాన్నారు. దేశ జిడిపికి రవాణా రంగం నుంచి 4.3 శాతం ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వాలు ఏ విధమైన సహాయం చేయకపోయినా, తమ సొంత పెట్టుబడితో ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా ఆటో, క్యాబ్‌ లను కొనుగోలు చేసి, స్వయం ఉపాధిగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల అధిక వడ్డీలకు వీరంతా బలైపోతున్నారని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా కేంద్రప్రభుత్వ విధానాలు కారణంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. అసలే కిరాయిలు లేక సతమతమవుతున్న ఆటో కార్మికులకు ఇంధన ధరలు పెరుగుదల వలన ఆదాయం భారీగా తగ్గిపోయిందన్నారు. ప్రతి సంవత్సరం 20శాతం థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంచుకునేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వీలు కల్పించడంతో 2014లో 1400 రూపాయలు ఉండే ఇన్సూరెన్స్‌ ప్రస్తుతం 5800 వరకు పెరిగిపోయిందన్నారు. ఏజెంట్లు ద్వారా ముడుపులు చెల్లిస్తే గాని ఆర్‌టిఒ ఆఫీస్‌లో ఫిట్నెస్‌ రెన్యువల్‌, లైసెన్స్‌ వంటివి చేయని పరిస్థితి ఉందన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సెన్సార్‌ కెమెరాలతో ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలానాలు కట్టాలంటే అప్పులు చేయక తప్పడం లేదన్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికులు ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నప్పటికీ వారి సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయిందన్నారు. డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే విధంగా బిఎన్‌ఎస్‌ 106 (1) (2) హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని గత ఏడాది డిసెంబర్‌లో తీసుకొచ్చిందన్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వెంటనే స్టేషన్‌ బెయిల్‌ తీసుకునే అవకాశం ఉండేదని, కొత్త చట్టంలోని నిబంధనల వలన కోర్టులో బెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ఆటో, ట్రాలీ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగే దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో డ్రైవర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశంలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో కరపత్ర ప్రచారం, సంతకాల సేకరణ చేయాలని, 16న కోట దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వాహనాలతో ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి రాములు, లారీ అసోసియేషన్‌ అధ్యక్షులు సహిత అక్బర్‌ , ఉపాధ్యక్షులు ఎ.శ్రీనివాసరావు, గూడ్స్‌ వెహికల్స్‌ నాయకులు సూరిబాబు, వెంకటరమణ ,సత్తిబాబు , హైర్బస్‌ నాయకులు శివ, ఆటో యూనియన్‌ నాయకులు పాపారావు, మూర్తి, లక్ష్మణ్‌ దొర, సిఐటియు నాయకులు టివి రమణ, బి.రమణ, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎపి మెడికల్‌ రిప్సే యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు ఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️