మాచర్లలో 95 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌

May 10,2024 00:37

పోలింగ్‌ సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఆర్వో శ్యాంప్రసాద్‌
ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ :
మాచర్ల నియోజకవర్గ పరిధిలో 95 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు, విధి నిర్వహణలోనున్న 2568 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాచర్ల రిటర్నింగ్‌ అధికారి శ్యాం ప్రసాద్‌ తెలిపారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నేడు కూడా చివరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను నిర్వహిస్తామని, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 100 శాతం హోం ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందన్నారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో జరిగిన ఘటనకు శాంతిభద్రతలకు సంబంధం లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో 2 లక్షల 56 వేల 764 మంది ఓటర్లకు బిఎల్‌ఓ ద్వారా ఓటర్‌ స్లిప్పులు పంపిణీ చేశామని తెలిపారు. 299 పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ ఏజెంట్లకు పోలింగ్‌ పాస్‌ జారీ చేసేందుకు ఆధార్‌ కార్డు, ఒరిజినల్‌ ఫొటో తీసుకురావాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు మొబైల్స్‌ను వినియోగించరాదన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌, వికలాంగులకు పోలింగ్‌ కేంద్రాల వద్ద నియోజకవర్గ పరిధిలో 90 వీల్‌ చైర్స్‌ సదుపాయం కల్పించామని, ఓటర్లంతా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 1067 మందిని బైండోవర్‌ చేశామన్నారు.
పోలింగ్‌ సిబ్బందితో సమావేశం
నియోజకవర్గంలో ఈనెల 13వ తారీఖున జరిగే పోలింగ్‌ ప్రక్రీయను సమర్థవంతంగా పూర్తిచేయాలని మాచర్ల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. గురువారం స్థానిక మానుకొండ కళ్యాణమండపంలో బూత్‌లెవల్‌ అధికారులతో సమావేశమయ్యారు. సమన్వయంతో పనిచేసి, అవాంతరాలు లేకుండా పోలింగ్‌ పూర్తి చేయాలన్నారు.
ప్రజాశక్తి -పెదకూరపాడు : స్థానిక జెడ్‌ఫి పాఠశాలలో 1555 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయని ఆర్వో శ్రీరాములు తెలిపారు. 85 ఏళ్లు దాటిన వారు నియోజకవర్గ పరిధిలో 200 మంది హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా 195 ఓట్ల నమోదు పూర్తయిందన్నారు.
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి నియోజకవర్గంలో హోం ఓటింగ్‌ కింద 263 ఓట్లు గాను 255ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ తెలిపారు. మంచానికి పరిమితంమై పోలింగ్‌ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగులకు దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌ హోమ్‌ ఓటింగ్‌ కు అవకాశం కల్పించింది. 8,9 తేదీల్లో హోమ్‌ ఓటింగ్‌ నమోదు చేయించారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు 8 బృందాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు 222, రెండో రోజు 33 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ తెలిపారు.

➡️