దడ పుట్టిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌

May 10,2024 21:42

రికార్డు స్థాయిలో నమోదు

దరఖాస్తు కంటే అధికంగా పోలింగ్‌

విజయనగరం జిల్లాలో 16170 ఓట్లు, మన్యంలో 8907 ఓట్లు నమోదు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌/పార్వతీపురం రూరల్‌  : విజయనగరం ఉమ్మడి జిల్లాలో గత ఐదు రోజులుగా జరిగిన ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలకూ లేని విధంగా పోస్టల్‌ బ్యాలెట్‌ అధికంగా నమోదు కావడం ఒకటైతే, దరఖాస్తు చేసుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటు వేసేందుకు ముందుకు రావడంతో వైసిపి, టిడిపి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ గణాంకాలను పరిశీలిస్తే 50శాతం కన్నా ఎక్కువ ఎవరూ వినియోగించుకొనేవారు కారు. కానీ ఈసారి దాదాపు 95శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లు వినియోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది.విజయగనరం జిల్లాలోని విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎస్‌.కోట, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఎన్నికల విధులకు హాజరు కానున్న 14,195 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరు కాకుండా మరో 4436 మంది ఇతర జిల్లాలకు చెందిన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇతర జిల్లాల వారితో కలిపి మొత్తంగా 18,631 మంది దరఖాస్తు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోపోయినా (ఫారం 12 సమర్పించకపోయినా) డ్యూటీ ఆర్డరు ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో సుమారు 16 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో నమోదు అయిన పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విజయనగరం నియోజకవర్గంలో 3975 మంది, బొబ్బిలి 2105, శృంగవరపుకోటలో (మిగతా..3లో)1776, నెల్లిమర్ల 1525, గజపతినగరం 1665, రాజాం 1741, చీపురుపల్లి 1405 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఈనెల 5 నుంచి 9 వరకు ఏడు నియోజకవర్గాల్లో విజయనగరంలో 4212, బొబ్బిలిలో 2433, శృంగవరపుకోటలో 2012, నెల్లిమర్ల 1760, గజపతినగరం 2040,రాజాం 2215, చీపురుపల్లిలో 1497 ఓట్లు నమోదయ్యాయి. మన్యం జిల్లాలో 8907 బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ కాగా, అందులో పాలకొండ నియోజకవర్గం నుండి 1796, కురుపాం 2446, పార్వతీపురం 2091, సాలూరు 1467, ఇతర జిల్లాల వారికోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లో 1167 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వానికి, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మధ్య సిపిఎస్‌తో పాటు ఇతర ఇతర విషయాల్లో జరిగిన పోరాటాల నేపథ్యంలో ఈ బ్యాలెట్‌ ఓటింగ్‌ అధికార పార్టీపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందన్న చర్చ జరుగుతుంది.మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు నమోదు చేసుకున్న వారికి ఓట్లు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో ఎన్నికల కమీషన్‌ ఎన్నికల విధులకు సంబంధించిన ఆర్డరు కాపీ ఉన్న ప్రతి ఒక్కరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ వేసుకునే అవకాశం కల్పించడంతో ఓట్లు పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అధికంగా ఉద్యోగుల ఓట్లు పోలవ్వడంతో ఎవరికి నష్టం కలిగిస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఉద్యోగుల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇన్ని ఓట్లు నమోదు కావడానికి కారణంగా చర్చ జరుగుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువగా పోలవ్వడం వల్ల అధికార వైసిపికి నష్టం జరుగుతుందనీ, ప్రతిపక్ష పార్టీలకు మేలు జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతుంది.

➡️