రజక వృత్తిదారులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలి

Mar 27,2024 15:37 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ నిధులను వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన చిట్యాల.ఐలమ్మ రజక కార్యాలయ భవనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు జిల్లా ప్రధాన కార్యదర్శి సి. గురు శేఖర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భాస్కరయ్య మాట్లాడుతూ.. ‘వీరనారి చిట్యాల ఐలమ్మ నిర్వహించిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా చేపట్టి ఈ రాష్ట్రంలో రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కార్మిక కర్షక భవన్ లో ప్రారంభించబడిన చిట్యాల ఐలమ్మ కార్యాలయం దోహదపడుతుందని, భవన నిర్మాణ లో భాగస్వామ్యాలైన రజక వృత్తిదారుల కర్నూలు జిల్లా నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియ చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు రజకులను ఎన్నికల సందర్భంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు వినియోగించుకుంటూ, ఎన్నికల అనంతరం వారి సంక్షేమ- అభివృద్ధి గురించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకర చర్యలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ ఫలితాలు రజకుల అభివృద్ధి- సంక్షేమానికి ఏ మాత్రం ఉపయోగపడలేదని దీనికి కారణం నేటి వరకు పాలించిన పాలక ,ప్రతిపక్ష పార్టీలు అనుసరించిన విధానాలే కారణం. రాష్ట్రంలో నేటికీ సామాజిక సేవ వృత్తిగా ఉన్న రజక వృత్తిదారులపై, అపార్ట్మెంట్ వాచ్మెన్- కమ్- ఇస్త్రీదారులపై దాడులు దౌర్జన్యాలు, అక్రమ కేసులు అగ్రవర్ణ పెత్తందారులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాటి నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ-అభివృద్ధి కార్పొరేషన్లకు విధివిధానాలు రూపొందించకుండా, బడ్జెట్లో కేటాయించిన నిధులను కార్పొరేషన్ చేసిన తీర్మానాలకు ఖర్చు చేయకుండా, ఆ నిధులను ఇతర అవసరాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులు అనుసరించిన విధానాల ఫలితమే. రజక వృత్తిదారుల అభివృద్ధి- సంక్షేమానికి బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణ సదుపాయాలను సబ్సిడీగా మంజూరు చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సేవ వృత్తిలో ఉన్న రజకులకు 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి రజక వృత్తిదారునికి (చేనేత, గౌడ, మత్స్యకారులకు కేటాయించిన విధంగా) సామాజిక వృద్ధాప్య పెన్షన్ సౌకర్యం రజక వృత్తిదారులకు కేటాయించాలని వారు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలలో ధోబి కాంట్రాక్టులను రజకేతరులకు కేటాయించడం వలన రజక వృత్తిదారులు వారి వద్ద కూలీలుగా మారి శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న దోబీ కాంట్రాక్టర్ల నిర్వహణకు రజకులకు సాంకేతిక నైపుణ్యం శిక్షణ నిచ్చి ఆ కాంట్రాక్టులను రజకుల చే రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఏర్పాటు చేయుటకు తగు చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాల లోని ధోబి పోస్టులను వెంటనే అర్హులైన రజకులతో భర్తీ చేపట్టాలని వారు పేర్కొన్నారు.ఈ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్, ఐలు జిల్లా కార్యదర్శి లక్ష్మన్న, కర్నూలు జిల్లా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు జి. రామకృష్ణ లు మాట్లాడుతూ రజక వృత్తిదారులకు ఎల్లప్పుడూ సిఐటియు అండగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతుందని చెప్పారు. అందుకే రజక వృత్తిదారులందరూ రాంబాబు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష పార్టీ ల నాయకులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో చిన్నపిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు ఆడవారిపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నినాదమైన బేటి బచావో బేటి పడావో అనే నినాదం నినాదం గానే ఉందని వారికి ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని, దోషులను శిక్షంచాల్సింది పోయి క్షమాబిక్ష బెట్టి సంబరాలు జరుపుకుంటున్న సంఘటనలు బిజెపి ప్రభుత్వంలో చూస్తున్నామని తెలిపారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా బిజెపి, బిజెపి జతకట్టిన టిడిపి, వైఎస్ఆర్సిపి ,జనసేన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
రజక వృత్తిదారులందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే దేనినైనా సాధించవచ్చునని తెలిపారు. వామ పక్ష పార్టీల నాయకులను గెలిపించినప్పుడే పేద బడుగు బలహీన కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలను అసెంబ్లీలో విన్నవిస్తారని వారి కోసం పాటుపడతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజల మేలుకొని మనకోసం ఏ నాయకుడు పని చేస్తారో అలాంటివారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ముక్కన్న, హనుమంతు, శ్రీనివాసులు ,జయమ్మ, వెంకటేశ్వర్లు తదితర వృత్తిదారుల సంఘం నాయకులు ప్రసంగించారు రజక వృత్తిదారులు విరివిగా పాల్గొన్నారు.

➡️