ఓటర్లకు ప్రలోభాల ఎర..?

ఓటర్లకు ప్రలోభాల ఎర..?

తలమునకలైన ప్రధాన పార్టీలు

స్లిప్‌లతోపాటే విలువైన కూపన్లు, నగదు

గెలుపే లక్ష్యంగా అన్ని అస్త్రాలతో బరిలోకి.

అవధులు దాటుతున్న ప్రలోభాలు

పాలకుల వైఫల్యాలే ప్రచార ఎజెండాగా బ్లాక్‌

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

ఎన్నికలంటేనే పంపకాలు.. అందులో అక్రమాలు.. అంచనాలకు మించి అభ్యర్థుల వ్యయాలు.. వెరసి ఓటర్లను తిప్పుకునే ప్రలోభాలు… విశాఖ నగరంతోపాటు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో సర్వే సర్వత్రా ఇదే దర్శనమిస్తోంది. తాజా ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసిపి, తెలుగుదేశం, కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ సహా జైభారత్‌ వంటి పార్టీలే కాకుండా ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల నేతలు ఓటమి భయంతో అల్లాడుతున్నారు. వార్డుల వారీగా తన అనుచర గణంతో టిడిపి, వైసిపి రెండూ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి.గడచిన వారం రోజులుగా అనేక రకాలైన ప్రలోభాలతో ప్రధాన పార్టీలు చెలరేగిపోతున్నాయి. రెండు రోజులుగా అది మరింతగా ఊపందుకోవడం కనిపిస్తోంది. ఓటర్లను ప్రసన్నంం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని అస్త్రాలను వినియోగిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అనుచరగణమంతా రంగంలోకి ఓటర్లకు తాయిలాలను అందించే పనిలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో నోట్ల కట్టలు పోలీసులకు లభ్యమవుతున్నాయి. ఎన్నికల సందర్భంగా పంపిణీకి సిద్ధంగా ఉంచిన సామగ్రి తూర్పులో పట్టుబడింది. నగరంలోని తూర్పు, దక్షిణం, ఉత్తరం, దక్షిణం, భీమిలి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్లా ఓటర్లకు గాలం వేసే కసరత్తు రాత్రీపగలూ సాగుతోంది. ఇళ్లకు, వ్యక్తులకు బాక్సులు…ఈనెల 10 లోపు డబ్బంతా ఓటర్లకు పంపిణీ జరిగిపోయే నెట్‌వర్క్‌తో ప్రధాన రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. రూ.కోట్ల కొద్దీ నోట్ల కట్టలు వార్డుల్లో చెలామణిలో ఉన్నాయి. ప్రధాన పార్టీలు చేపట్టే ఈ క్రతువుతో కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు, వామపక్షాలు, ఇతర అభ్యర్థులు నివ్వెరపోతున్నారు. ఈనెల 13న జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ప్రక్రియ ఈ రెండు పార్టీల నడుమ సాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే కాకుండా విశాఖనగరంలోని నాలుగు అసెంబ్లీలు, పార్లమెంట్‌ పరిధిలోని మరో మూడు గాజువాక, భీమిలి, శృంగవరపుకోట స్థానాలను కలుపుకుని మొత్తంగా ఏడుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపోటములపై తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్‌కు ప్రచారం జరుగుతున్న, ముందే నిర్ణయించుకున్నట్టుగా రూ.30కోట్లకు దాటి ఖర్చులు చేస్తున్నారన్న చర్చ ఆ ఇరు పార్టీల శ్రేణుల్లోనూ నెలకొంది. తూర్పు, భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇరు పార్టీల అభ్యర్థులు భారీ స్థాయిలో రూ.కూపన్లను పంపిణీ చేశారు. ఇదివరకే చీరలు, బట్టలు బాక్సులు ఓటర్ల ఇళ్లకు కూపన్‌లు, ఇతర బహుమతుల బాక్సులను పంపించే ప్రక్రియ నడుస్తోంది. తాజాగా ఇది అన్ని వార్డుల్లోనూ కొనసాగుతోంది. ఇండియా బ్లాక్‌, సిపిఎం, సిపిఐ విలక్షణ ప్రచార శైలిఈ సెగ్మెంట్లలో పోటీచేస్తోన్న ఇండియాబ్లాక్‌ బలపరచిన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ అభ్యర్థులు జిల్లాను, రాష్ట్రాన్ని పీడిస్తున్న ప్రధాన ప్రజాసమస్యలు, గడచిన 10ఏళ్లుగా బిజెపి, టిడిపి, జనసేన కూటమి, వైసిపి వైఫల్యాలనే ప్రచారంలో ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాన్ని తీసుకున్నాయి. గాజువాకలో సిపిఎం అభ్యర్థి మరడాన జగ్గునాయుడు, పశ్చిమంలో సిపిఐ అభ్యర్థి అత్తిలి విమల పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మికులతో మమేకమై, తమ ప్రజా అజెండాతో వెళ్తున్నాయి. ఎక్కడ బలహీనమో అక్కడ ప్రలోభాలుప్రధాన రాజకీయపార్టీలు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడకు ఎన్నికల ప్రలోభాల సామగ్రి తరలిపోతుంది. తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటమి భయంతో ఇరు ప్రధాన పార్టీలు ఈ అడ్డదారులు తొక్కుతున్నారు. ఆరిలోవలో ఒక పార్టీ అభ్యర్థి రూ.3వేల విలువైన కూపన్‌లు పంచి పెడుతున్నారు. అధికార పార్టీ వాళ్లు ఇస్తే తీసుకుని తనకు ఓటేయాలంటూ మొన్నటివరకూ చెప్పిన ఆ అభ్యర్థి తాజాగా ఆరిలోవలో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగడం కనిపిస్తోంది. అలాగే మద్దిలపాలెం, ఎంవిపి ఏరియాలో మరో పార్టీ అభ్యర్థి రూ.2500లు విలువైన కూపన్‌ కార్డులను పంచిపెడుతున్నారు. ఇప్పటికే ఓటర్లకు ఎన్నికల స్లిప్‌లను అధికార యంత్రాంగం, జివిఎంసి పంపిణీ చేసింది. వీరి వెనకే కొన్ని కార్డులు ఒక బృందం ఈ స్లిప్‌లు అందుకున్న ఓటర్లను కలుస్తోంది. మరో బృందం వచ్చి ఆ కార్డులు స్వీకరించి వారికి రూ.డబ్బులు పంపిణీ చేసి వచ్చేస్తుంది. ఈ ప్రక్రియలో రియల్‌ అభ్యర్థుల హల్‌చల్‌ నడుస్తోంది. 10వతేదీ.. ఒక్కరోజునే పంపకాల టార్గెట్‌? 13న పోలింగ్‌ కాగా, 10వ తేదీలోపే ఈ పంపకాలు సాగాలన్న డెడ్‌లైన్‌ పెట్టుకున్నారు. 10న అధికారులంతా శ్రీవరహా లక్ష్మీనరసింహా స్వామి చందనోత్సవం (సింహాచలం)లో హడావుడిగా ఉంటున్నందున ఆ రోజే అధిక ప్రలోభాలు జరిగిపోవాలని ఈ ఇరు పార్టీల అభ్యర్థులు టార్గెట్‌ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

➡️