వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి : సిపిఎం- సిపిఐ డిమాండ్‌

చిత్తూరు : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ … ఆదివారం చిత్తూరు రైల్వే స్టేషన్‌ వద్ద సిపిఎం- సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజులు మాట్లాడుతూ … కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేయకపోవడంతో మరో పోరాటం చేస్తున్న రైతాంగం పై విచక్షణారహితంగా దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేయడం దుర్మార్గమని రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. 14 న దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నదని, ఆ సందర్భంగా దేశంలోని రైతాంగం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉంటున్న రైల్వే లను ప్రైవేటీకరణ చేసే దిశ వేగంగా పావులు కదుపుతున్నారని అందులో భాగంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చి భారీ స్థాయిలో టికెట్‌ రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేసి భవిష్యత్తు తరాలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం దారుణమన్నారు. అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను మొత్తం కార్పొరేట్‌ శక్తులైన ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సందర్భంగా కొన్ని రకాల తాయిలాలు మాత్రం ఇస్తే సరిపోదని దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నలకు ప్రమాదకరమైన వ్యవసాయ నల్ల చట్టాలను ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల పేరుతో రైతులపై దాడి చేస్తున్నారని స్మాట్‌ మీటర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బిజెపి దానికి వంత పాడుతున్న వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జ్యోతి, లోకనాథం, ప్రసాద్‌ సిపిఐ నాయకులు గోపి ,చంద్ర, రమాదేవి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

➡️