జనమంతా వచ్చి.. మద్దతుగా నడిచి..

May 1,2024 23:49

నోట్ల దండతో సంఘీభావం తెలుపుతున్న ప్రజలు
ప్రజాశక్తి-తాడేపల్లి :
ఇండియా వేదిక బలపరిచిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు తాడేపల్లిలో బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు ముగ్గురోడ్డులోని బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్‌ షో ప్రారంభించగా స్థానిక ప్రజలు అడుగడుగునా పూలవానంతో మద్దతు తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్‌, ఆర్‌ఎంఎస్‌ కాలనీ, లంబాడీపేట, పోతురాజుస్వామి గుడి, రన్నింగ్‌ రూమ్‌ సెంటర్‌, మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం, నెహ్రుబొమ్మ సెంటర్‌, పద్మశాలీ బజార్‌, బోసుబొమ్మ సెంటర్‌, ఉండవల్లి సెంటర్‌ మీదుగా పోలకంపాడు వరకు 2.5 కిలోమీటర్లు అభ్యర్థితో పాటు జనం కూడా రోడ్‌షోలో పాల్గొన్నారు. పాస్టర్లు, చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లు, వివిధ రంగాల వారు అభ్యర్థిని కలిసి మద్దతు తెలిపారు. ఓటుతో పాటు నోటు కూడా అంటూ నోట్ల దండను జొన్నా శివశంకరరావు మెడలో వేశారు. నీళ్ల వారులు, హారతులతో పలు ప్రాంతాల్లో రోడ్‌షోకు ఘన స్వాగతం లభిచింది. ఎండ అధికంగా ఉండటంతో బోసుబొమ్మ సెంటర్‌లో చింతా శ్రీరామ్‌ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పోలకంపాడులో ప్రజలు తమ సమస్యలపై అర్జీలిచ్చారు. 70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న బాపనయ్యనగర్‌ వాసులు పట్టాలివ్వాలని సైకం వెంకటనారాయణ ఆధ్వర్యంలో విన్నవించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఉన్న ఇళ్లను తొలగించి రోడ్డు వేయాలని టిడిపి భావించి ఇప్పుడు మాత్రం పట్టాలిస్తామంటూ లోకేష్‌ చెబుతున్నారని అన్నారు. గతంలో అధికారంలోకి వస్తే పట్టాలిస్తామని వైసిపి మాట ఇచ్చి తప్పిందని అన్నారు. బాపనయ్యనగర్‌ ఏర్పాటు సిపిఎం ఆధ్వర్యంలోనే జరిగిందని, పట్టాలు కూడా ఆ పార్టీ ద్వారానే వస్తాయని తాము భావిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రత్యేక హోదా ఇండియా వేదిక ద్వారానే సాధ్యంరాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఇండియా వేదిక ద్వారానే సాధ్యమని జొన్నా శివశంకరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, రూరల్‌ కార్యదర్శి డి.వెంకటరెడ్డి అన్నారు. రోడ్‌ షోలో భాగంగా వివిధ సెంటర్లలో ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని, అటువంటి బిజెపితో టిడిపి, జనసేన పార్టీలు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుని ముందుకు సాగడం ప్రజల ప్రయోజనాలకు ముప్పని అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసిపి ఏనాడు రాష్ట్ర హక్కుల గురించి, హోదా గురించి నోరెత్తలేదని విమర్శించారు. ఇప్పటివరకు రెండు దశల పోలింగ్‌లలో ఎన్‌డిఎ కూటమికి ఎదురుగాలి వీస్తోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందానికి మోడీ మాట్లాడుతున్నారని, మోడీతోపాటు బిజెపి నాయకుల వ్యాఖ్యలు దేశ సమగ్రతకు విఘాతమని చెప్పారు. నిత్యం ప్రజల కోసం పని చేసే ఎర్రజెండా అభ్యర్థులకు మద్దతుగా ప్రజలు నిలవాలని, మంగళగిరి ఎమ్మెల్యేగా శివశంకరరావును గుంటూరు ఎంపీగా సిపిఐ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.మురళీకృష్ణ, ఎం.సూర్యారావు, ఎంబివికె బాధ్యులు పి.విజయ, సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు డి.శ్రీనివాసకుమారి, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, ఎస్‌.ముత్యాలరావు, పి.గిరిజ, ఎం.శ్రీనివాసరెడ్డి, డివి భాస్కరరెడ్డి, డి.యోహాన్‌, వై.బర్నబస్‌, ఐ.ఇస్సాక్‌, డి.విజయబాబు, ఎం.లీలమ్మ, గోపమ్మ, ఎం.లలితమ్మ, పావని, కె.లక్ష్మయ్య, చిన్ని, ఫిరోజ్‌, కె.బాబూరావు, వై.శ్రీనివాసరావు, నల్లగొర్ల శ్రీను, జి.శ్రీను, సిహెచ్‌.శ్రీరామ్‌, ఎమ్‌డి బాబ్జీ, పి.నాగేశ్వరరావు, నాగబాబు, రామకృష్ణ, ఎస్‌.వెంకటనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు డి.సామ్యేలు, సిపిఐ నాయకులు టి.వెంకటయ్య, ఎం.డాంగే పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నులకపేట, సుందరయ్య ప్రెస్‌ కాలనీ, తెల్లక్వారీ, వడ్డెరపాలెం, ప్రకాష్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన వ్యక్తమైంది. ఎక్కడికక్కడ మహిళలు హారతులు పడుతూ, పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు మాట్లాడుతూ మతం పేరుతో బిజెపి ప్రజల మధ్య చీలికలు తెస్తోందన్నారు. సిపిఎం నాయకులు వి.దుర్గారావు మాట్లాడుతూ సిమెంటు ఫాక్టరీ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఎన్నికల అనంతరం పెద్దఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇళ్లను వేలం వేస్తామంటున్నారు…బకాయిల చెల్లింపునకు ఆరు రోజులే గడువు ఉందంటూ కెనరా బ్యాంక్‌ అధికారులు నోటీసులిస్తూ బెంబేలెత్తిస్తున్నారని టిడ్కో గృహాల లబ్ధిదారులు జొన్నా శివశంకరరావు ఎదుట వాపోయారు. పెనుమాకలో టిడ్కో గృహాల సముదాయాల వద్ద బాధితులను సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి కలిసి లబ్ధిదారులకు ధైర్యం చెప్పారు. లబ్ధిదార్లు మాట్లాడుతూ బంగారం తాకట్టు పెట్టి ఇంటి లోను కట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఆరు రోజుల్లోపు కట్టకపోతే మొండి బకాయిల పేరుతో పేపర్‌ ప్రకటన చేస్తామని, పేపర్‌ యాడ్‌ నిమిత్తం ఒక్కొక్కరు మరో రూ.ఐదు వేలు అదనంగా చెల్లించాలని అంటున్నారని, ఇళ్లను వేలం వేస్తామని చెబుతున్నారని వాపోయారు. శివశంకరరావు మాట్లాడుతూ లబ్ధిదారులు బకాయిలు చెల్లించేందుకు బ్యాంకు అధికారులు సమయం ఇవ్వాలన్నారు. బ్యాంకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనకు దిగాల్సి వస్తుందని రవి హెచ్చరించారు. బాధితులకు సిపిఎం అండగా నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్‌కె ఎర్రపీరు తదితరులు పాల్గొన్నారు.

➡️