అంగన్‌వాడీలపై నిర్బంధం

Jan 22,2024 00:05
హుకుంపేటలో నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందం సమస్యలను పరిష్కరించాలని చలో విజయవాడకు ఆదివారం వెళ్తున్న అంగన్‌వాడీ, సిపిఎం, ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. గృహ నిర్బంధాలు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రజాశక్తి పాడేరు: జిల్లా కేంద్రంలో ఐటిడిఏ ఎదుట అంగన్వాడీ వర్కర్లుచ హెల్పర్లు సమ్మెలో భాగంగా నిర్వహిస్తున్న నిరవధిక దీక్ష 41వ రోజు ఆదివారం కొనసాగించారు. తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నినాదాలు చేశారు. విజయవాడ వెళ్లే అంగన్వాడీ లపై పోలీసుల నిర్బంధాలు, అక్రమంగా అరెస్టులను ఖండించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాంలో భాగంగా చలో విజయవాడకు వెళుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి వి.భాగ్యలక్మిని పోలీసులు నిర్బంధించి అరెస్టుకు పూనుకోవడం దుర్మార్గ మైన చర్య అని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు. సుందర్‌రావు అన్నారు. సమస్యల పరిష్కరించక పోగా అనేక రూపాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ, నిర్బందాలు ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.హుకుంపేట:స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లు చేస్తున్న సమ్మె అదివారం 41వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నోటీసుల ఇచ్చి అంగన్వాడీ టీచర్లను భయ బ్రాంతులకు గురి చేయడం సరికాదని అంగన్వాడి యూనియన్‌ నేతలు అప్పలకొండమ్మ, కృష్ణవేణి అన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇన్ని రోజులు ధర్నా చేస్తున్నా కనీసం ఆడవాళ్ళని కూడా కనికరం లేక పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమంటూ వారు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు. పద్మ, కుమారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.చింతపల్లి :కోటి సంతకాలతో జగనన్నకు చెపుదాం చలో విజయవాడకు కదులుదాం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ అంగన్వాడీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పలు గ్రామాలలో సంతకాలు సేకరించారు. ఆ సంతకాలను మీడియాకు చూపించారు. ఈ సంతకాల పత్రాలను జగనన్నకు చేరవేస్తామన్నారు. సేకరించిన సంతకాలను విజయవాడలో జగనన్నకు ఇవ్వటానికి వెళుతున్న అంగన్వాడిలను పోలీసులు అడ్డుకుని నిర్బంధించి గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. చలో విజయవాడకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాటుకుంటూ అంగన్వాడీలు సేకరించిన సంతకాలు సమర్పించే తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్ష కార్యదర్శులు రాములమ్మ, పెంటమ్మ, అక్కమ్మ, లక్ష్మి, ఇందు, జానకమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.పెదబయలు: అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం అక్రమ అరెస్టులు నిర్బంధాన్ని. సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు బోండా సన్నిబాబు తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో 41వ అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది.చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి వర్కర్లను నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా టెర్మినేట్‌ చేస్తామని ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని సన్నిబాబు విమర్శించారు. ఇటువంటి భయభ్రాంతులకు అంగన్వాడి వర్కర్లు భయ పడేది లేదని, సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వర్కర్లు పోరాటం ఆపరని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు టి రాజమ్మ, కొండమ్మ, కౌసల్య, పద్మ, భాగ్యలక్ష్మి సుబ్బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.అనంతగిరి:మండలంలో అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. ఎస్మా చట్టం ప్రయోగించి అంగన్వాడీలకు మెమోలు జారీ చేసి భయ పెడు తున్నారని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.జగన్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. విఆర్‌.పురం. తమ డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనం సత్యనారాయణ ఆక్షేపించారు. 41రోజులుగా శాంతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌( సిఐటియు) ఆధ్వర్యంలో ఈనెల 22న చలో విజయవాడ ఆందోళనకు విఆర్‌ పురం నుండి బస్సుల్లో వెళ్తున్న వర్కర్లను ఎక్కడకక్కడ పోలీసులు బస్సులు, టాటా మ్యాజికులు ఆపి, వారి హ్యాండ్‌ బ్యాగులు చెక్‌ చేయటం, నిర్బంధం లోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో జిల్లా సభ్యులు సున్నం రంగమ్మ సిఐటియు, మిడ్డే మీల్స్‌ కార్మికులు పాల్గొన్నారు.రాజవొమ్మంగి : అంగన్వాడీల నిరవధిక సమ్మె పట్ల ప్రభుత్వనిర్బంధ వైఖరిని నిరసిస్తూ ఆదివారం 41వ రోజున రాజవొమ్మంగిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సంరద్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, అంగన్వాడీ యూనియన్‌ నాయకురాలు కె వెంకటలక్ష్మి, చిన్ని కుమారి మాట్లాడుతూ, చాలీచాలని జీతాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని పాదయాత్రలోనూ, ఎన్నికల సమయంలోనూ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి హామీనిచ్చిన సిఎం జగన్‌, ఇపుడు కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమని, మాటిచ్చి తప్పిన వైసిపి సర్కార్‌కు, సిఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎల్‌ సత్యవతి, రాజేశ్వరి, వీరయమ్మ, రమణి, రమణ, వీరలక్ష్మి, మంగ, లక్ష్మి, చిన్నమ్మలు, రాధ, భవాని, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️