అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి -పాడేరు: రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజక వర్గాల ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.విజయ సునీత విజ్ఞప్తి చేసారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో 1021 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో ఎటువంటి మార్పు ఉండబోదని తెలిపారు. 21 కేంద్రాల పేరు మార్పును గుర్తించడం జరిగిందని, అదే ప్రాంతంలో లొకేషన్‌ మార్పు లేదా సరిపడా వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. మూడు నియోజకవర్గాలకు మూడు డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలు గుర్తించడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు. అరకు నియోజక వర్గంలో అరకు తహసిల్దార్‌ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామని, పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెసిప్షన్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం బార్సు ఆశ్రమ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం, తలారిసింగి (పాడేరు) ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో రిసెప్షన్‌, స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తుది జాబితా ప్రచురణ నాటికి 7,61,255 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం జరుగుతున్న సవరణలు, కొత్తగా నమోదైన ఓటర్లు సోమవారం నాటికి నాలుగువేల వరకు పెరిగాయని, మరో రెండు వేల ఓటర్లు పెరిగే అవకాశం ఉందని కలెక్టర్‌ వివరించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సరళి, నామినేషన్‌ ప్రక్రియ, కౌంటింగ్‌ తదితర అంశాలపై ఒక వర్క్‌ షాప్‌ నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యు అధికారి బి.పద్మావతి, ఆయా పార్టీల నేతలు కే.బాలకృష్ణ, ఎల్‌.సుందర రావు, ఆనంద రావు, మంగ్లన్న దొర, శివకుమార్‌, పండన్న, ఎం.వంశీకృష్ణ పాల్గొన్నారు.

➡️