జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ విజయసునీత

ప్రజాశక్తి -పాడేరు:జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో 12,457 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.6,15,12,533లు జమ అయ్యాయి. 2023 – 24 ఏడాది మొదటి విడత జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అక్టోబర్‌ – డిసెంబర్‌, 2023 త్రైమాసికానికి విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన రెడ్డి కృష్ణా జిల్లా, పామర్రులో శుక్రవారం బటన్‌ నొక్కారు.ఇందులో భాగంగా కలెక్టరెట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. సమస్య లను అధిగమించడానికి విద్య అవసరమన్నారు. డిగ్రీ తర్వాత సివిల్‌ సర్వీసెస్‌కు ఉన్న పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఇందుకు ప్రభుత్వం పథకాలు ప్రవేశ పెడుతుందన్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదు అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే 12,457 మంది విద్యార్థులకు ఖాతాల్లో రూ.6,15,12,533 కోట్లు నగదు సంబంధిత ఖాతాలకు జమ అవుతుందన్నారు. జిల్లాలో 10,327 మంది ఎస్‌టి విద్యార్థుల ఖాతాల్లో రూ.4,76,91,215లు, 339 మంది ఎస్‌.సి విద్యార్థుల ఖాతాల్లో రూ.2,29,25,94, బిసి సంక్షేమ శాఖ కింద 1,319 మంది బి.సి విద్యార్థులకు రూ.82,26,499, 127 మంది ఇ.బి.సి విద్యార్థులకు రూ.11,39,425, 282 మంది కాపు విద్యార్ధులకు రూ.16,78,981, మైనారిటీ సంక్షేమ శాఖ కింద పది మంది క్రిస్టియన్‌ మైనారిటీ విద్యార్ధులకు రూ.1,00,520, 53 మంది ముస్లిం మైనారిటీ విద్యార్ధులకు రూ.3,83,299లు కలిపి మొత్తం 12,457 మంది విద్యార్ధులకు రూ.6,15,12,533 జమ చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ విద్యా పథకాలు దోహదపడుతున్నాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ జగనన్న విద్యా దీవెన నమూనా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.టి. కమిషన్‌ సభ్యులు లిల్లీ సురేష్‌, రామలక్ష్మి, ఎంపిపి ఎస్‌.రత్నకుమారి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు పాల్గొన్నారు.

➡️