డిఎస్‌సి పోస్టుల భర్తీలో.. గిరిజన నిరుద్యోగులకు అన్యాయం

పొటొ: మాట్లాడుతున్న అప్పలనర్స

ఆదివాసి గిరిజన సంఘం నేత అప్పలనరస ధ్వజంప్రజాశక్తి-పాడేరు: గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని గిరిజన సలహా మండలి (టీఏసి) లో చేసిన తీర్మానానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ జారీ చేయడం గిరిజన వ్యతిరేక విధానమని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనర్శ మండిపడ్డారు. పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవో 3 రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేసిందని, గిరిజనుల పోరాట ఫలితంగా గిరిజన సలహా మండలి లో ఎమ్మెల్యేలు తీర్మానం చేశారని, దీని ప్రకారం ఆదివాసులకు 100శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలన్నారు. మరో పక్క సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలన చేయాలని పిటిషన్‌ దాఖలై విచారణ దశలో ఉంటే వాటికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకంగా పూనుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జనరల్‌ డిఎస్సిలో 6100 పోస్టులలో ఎస్టీలకు సంబంధించిన సుమారు 1023 పోస్టులను భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. వీటిలో ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 500 పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొన్నా ఆదివాసులకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 పోస్టులు మాత్రమే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు రోస్టర్‌ పాయింట్లు ప్రకారం కేటాయించారని చెప్పారు.జనరల్‌ డిఎస్సీ నిబంధన ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు రిక్రూట్మెంట్‌ అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజన గురుకులం సొసైటీ నిబంధన ప్రకారం ఖాళీ పోస్టులను సొసైటీ నోటిఫికేషన్‌ ద్వారా మాత్రమే భర్తీ చేయాలన్నారు. సొసైటీ నిబంధనలను దిక్కరించి జనరల్‌ డిఎస్సీ లో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఖాళీగా ఉన్న 1800 పోస్టులకు గను 600 పోస్టులను జనరల్‌ డిఎస్సిలో కలిపి భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం గిరిజన సంక్షేమ గురుకుల నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. గిరిజన గురుకులల్లో రోస్టర్‌ పాయింట్ల పేరుతో ఆదివాసీ నిరుద్యోగులను స్కూల్‌ నుంచి గెంటి వేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో 2శాతం ఉన్న గిరిజనేతరులకు 94 శాతం పోస్టులు కేటాయించడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఆదివాసులకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలను, రాయితీలను నీరుగార్చడం సరికాదని. రాష్ట్ర ప్రభుత్వం చర్యను అధికార ప్రతిపక్షాల ప్రజా సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ ఎమ్మెల్యేలు, ఎంపిల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు. వీటిపై ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎస్‌.ఎఫ్‌. ఐ జిల్లా అధ్యక్షుడు కొర్ర కార్తిక్‌, జిల్లా కార్యదర్శి కొర్ర జీవన్‌ కుమార్‌, జిల్లా నాయకులు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

➡️