పూర్తిస్థాయి జడ్జిని నియమించాలి

మాట్లాడుతున్న అప్పలనర్స

ప్రజాశక్తి -పాడేరు: స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగాలల్లో నూరు శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 3పై ఆదివాసీ గిరిజన సంఘం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారణకు పూర్తి స్థాయి న్యాయమూర్తుల సభ్యులను నియమించాలని సుప్రీంకోర్టును ఆదివాసీ అధికార మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ కోరారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు జీవో 3 ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ను ఆదివాసీ గిరిజన సంఘం సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ ను 2020 జూన్‌ 30న దాఖలు చేసినట్లు చెప్పారు. పిటిషన్‌ ను స్వీకరించిన కోర్టు ఐదు మందితో కూడిన జడ్జిలతో కూడిన బెంచ్‌కు సిపార్స్‌ చేసిందన్నారు. గిరిజన సంఘంతో పాటు సుమారు 17 పిటిషన్‌ సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయని, ఇప్పటికే రెండుసార్లు విచారణకు వచ్చిందని, పూర్తిస్థాయి జడ్జిలు లేరని, దీంతో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించకుండా వాయిదాలు వేస్తోందన్నారు. బుధవారం విచారణకు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి జడ్జీలను నియమించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. జీవో 3 ను రద్దు చేసి నేటికీ మూడున్నర ఏళ్లు అవుతున్నా పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పున: సమీక్షించి ఆదివాసులకు నూరు శాతం రిజర్వేషన్‌ హక్కుని కల్పించాలని పెద్ద ఎత్తున పోరాటం చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆదివాసీల పట్ల వారి చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ధర్మాన పడల్‌, జిల్లా కమిటీ సభ్యులు కోటి బాబు, సంకయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️