వైసిపి ఎన్నికల సమరోత్సాహం

Jan 27,2024 23:46
బహిరంగ సభలో మాట్లాడుతున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:’75 ఏళ్లు వయసు మళ్లిన చంద్రబాబు మాదిరిగా నేను పొత్తుల కోసం దత్తపుత్రుడు, ఇతరుల వెంట వెంపర్లాడను. ప్రజలే నా ధైర్యం.. సంక్షేమం, అభివృద్ధి పథకాలే నా విధానం’ – అని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రానున్న ఎన్నికలకు సన్నద్ధంగా విశాఖ జిల్లా భీమిలిలోని సంగివలస వద్ద శనివారం సాయంత్రం వైసిపి ఉత్తరాంధ్ర క్యాడర్‌తో భారీ సభ నిర్వహించారు. దీనికి సిద్ధం సభగా ట్యాగ్‌లైన్‌ జతచేశారు. ఉత్తరాంధ్ర నలువైపుల నుంచీ తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి జగన్‌ మాట్లాడారు. ఎన్నికల శంఖారావం పూరించారు. క్యాడర్‌కు 2024 ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తూ విపక్షాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. పార్టీ క్యాడర్‌లో ఎన్నికల సమరోత్సాహాన్ని నింపారు. సభకు వేల సంఖ్యలో పార్టీ క్యాడర్‌ తరలిరావడంతో భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జనసముద్రం కనిపిస్తుందని జగన్‌ వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు. ఇటు పక్క పాండవ సైన్యం ఉంటే, అటుపక్క కౌరవ సైన్యం ఉందని అన్నారు. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోక తప్పదంటూ సమరోత్సాహాన్ని ప్రదర్శించారు. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడినని చెప్పారు. ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగ ప్రజలు తోడున్నారన్నారు. 2024 ఎన్నికల్లో వైసిపికి 175కి 175 రావడం ఖాయమన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదన్నారు. 2019 ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా ఈసారి వారికి రావన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఏమీలేదని అన్నారు కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక లాభనష్టాల లెక్కను చూడకుండా తాము సంక్షేమం ఇచ్చామన్నారు. అప్పట్లో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 650 హామీల్లో 10 శాతం కూడా అమలుచేయకుండా అన్నింటినీ అటకెక్కించేశాడని విమర్శించారు. హామీలు అటకెక్కించిన బాబు ఇంకా బతికే ఉన్నాడని ప్రజలకు వివరించాల్సిందిగా క్యాడర్‌కు జగన్‌ దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు మనలోంచి వచ్చిన మనవాళ్లేనని, బయటవారు కాదని క్యాడర్‌కు తెలిపారు. 2019 నుంచి 99 శాతం హామీలను అమలు చేశామన్నారు.

➡️