లోక్‌ అదాలత్‌లో 1863కేసులు పరిష్కారం

Jun 29,2024 19:57

 ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌ : రాజీయే రాజమార్గమని, కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకైక మార్గం లోక్‌ అదాలత్‌ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. జిల్లా కోర్టు సహా, ఉమ్మడిజిల్లాలోని అన్ని కోర్టుల్లోను శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా వారి జీవితాలలో మన: శాంతి కలిగి ఉంటారని అన్నారు. అదాలత్‌లో పలు సివిల్‌, క్రిమినల్‌ కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరంలో 1136, పార్వతీపురంలో 138, బొబ్బిలిలో 160, సాలూరులో 151, శృంగవరపుకోటలో 65, గజపతినగరంలో 91, చీపురుపల్లిలో 50, కొత్తవలసలో 53, కురుపాంలో 19 మొత్తంగా 1863 కేసులు పరిష్కరించారు. సుమారు రూ.15కోట్లను 6500 మంది కక్షిదారులకు చెల్లించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.రజని, ఎస్‌.దామోదరరావు, ఎం.మీనాదేవి, ఎన్‌.పద్మావతి, కె.నాగమణి, కె.విజయ కల్యాణి, హెచ్‌వి లక్ష్మి, టివిరాజేష్‌, ఎల్‌.దేవి రత్నకుమారి, బి.రమ్య, పి.బుజ్జి, ఎమ్‌. శ్రీనివాస రావు, ఎ.హరీష్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, పోలీసు, ఇన్సూరెన్సు అధికారులు పాల్గొన్నారు. కోర్టు ఆవరణలో పిఎఎన్‌ రాజు, పంపాన రవి కుమార్‌, పి. కుమార స్వామి ఆధ్వర్యంలో కక్షి దారులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.

➡️