బల్క్‌ డ్రగ్‌ పార్కు నక్కపల్లిలో ఏర్పాటు తగదు

నినాదాలు చేస్తున్న గ్రామస్తులు

ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి ప్రాంతంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేసి డంపింగ్‌ యార్డ్‌ గా మార్చొద్దని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం.అప్పలరాజు తెలిపారు. మండలంలోని రాజయ్యపేటలో సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు. బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా ప్రజలు తిరస్కరించిన బల్క్‌ డ్రగ్స్‌ పార్కును రాష్ట్ర ప్రభుత్వం నక్కపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, దానిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆమోదించడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న హెటిరో డ్రగ్స్‌ కంపెనీతో నక్కపల్లి ప్రాంతం ప్రజలంతా వాయు, జల కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ అనేక రకాల వ్యాదుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మత్య్సకారులు వేట సాగక ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నారన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో విదేశాల్లో నిషేదించిన, కాకినాడ జిల్లా ప్రజలు తిరస్కరించిన బల్క్‌ డ్రగ్‌ పార్కును నక్కపల్లి ప్రాంతంలో నెలకొల్పి ఈ ప్రాంతాన్ని డంపింగ్‌ యార్డ్‌ గా మార్చి ఇక్కడ ప్రజలు నివసించకుండా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్కపల్లి లో బల్క్‌ డ్రగ్‌ యూనిట్‌ నెలకొల్పే ప్రతిపాదనలను విరమించు కోవాలని డిమాండ్‌ చేశారు. కాలుష్యానికి నష్టం లేకుండా, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం పూను కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.రాజేష్‌, నాయకులు బి.రాము, కె.కాశీ, ఎం.నానాజీ, ఎం.జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️