ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మెరుపుసమ్మె

విలేకరులతో మాట్లాడుతున్న ఎన్జీవో సంఘం నాయకులు

            అనంతపురం కలెక్టరేట్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు సిద్ధమైనట్లు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.చంద్రమోహన్‌ తెలిపారు. గురువారం నాడు ఎన్జీవో హోంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని కారనంగానే మెరుపు సమ్మెలోకి వెళ్లాల్సి వస్తోందన్నారు. 12వ పిఆర్‌సి వేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రకటించకపోవడం సరికాదన్నారు. పిఆర్‌సి ప్రకటించాలని, సరెండర్‌ లీవ్‌లు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బాకాయిలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. క్వాంటమ్‌ పెన్షన్‌ పెంచాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయక తప్పలేదన్నారు. ఈ నెల 11వ తేదీ నిర్వహించే జేఏసీ సమావేశంలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. 12వ తేదీన చీఫ్‌ సెక్రటరీకి, జిల్లా కలెక్టర్లకు సమ్మె నోటీసు అందజేస్తామన్నారు. 14వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వివిధ దశల్లో ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌, జమీలాబేగం, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా జాయింట్‌ సెక్రటరీలు శోభారాణి, మహేష్‌, నగర కార్యదర్శి శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️