ఉపాధ్యాయలపై వ్యతిరేక విధానం సరికాదు

ఉపాధ్యాయలపై వ్యతిరేక విధానం సరికాదు

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరించడం సరికాదని ఏపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాయల్‌ వెంకటేష్‌, ఎస్‌.సిరాజుద్దీన్‌ అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని కదలించేందుకు ఉపాధ్యాయ సంఘాలన్ని ఏకతాటిపై వచ్చి ఉద్యమించాలన్నారు. ఏపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ దశాబ్ధాల క్రితం ఏర్పడిన మున్సిపల్‌ పాఠశాలలో మున్సిపల్‌ విద్యా వ్యవస్థ విద్యా శాఖలో విలీనం చేసిందన్నారు. తద్వారా ఏర్పడిన ఏ సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకపోగా నూతన సమస్యలు ఉత్పన్నమై మున్సిపల్‌ విద్యావ్యవస్థను చిన్న బిన్నం చేసేలా చర్యలు ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసులు వెంటనే ఆమోదించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రాయల్‌ వెంకటేష్‌, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు రఘురామ్‌రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు డి.ప్రభాకర్‌, గౌరవ సలహాదారు వెంకటేశులు, పూర్వ ప్రధాన కార్యదర్శి హనుమప్ప, ఉపాధ్యక్షులు బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️