ఎడిఫై పాఠశాలపై చర్యలు తీసుకోండి

డిఇఒ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

             అనంతపురం కలెక్టరేట్‌ : అనుమతులు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న అనంతపురం నగరంలోని ఎడిఫై వరల్డ్‌ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో నగరంలో ఏర్పాటుచేసిన ఎడిఫై వరల్డ్‌ స్కూల్‌ ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో డిఇఒ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతురు పరమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణయ్య, కుళ్లాయిస్వామి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ అనంతపురం నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎడిఫై వరల్డ్‌ స్కూల్‌ ముందస్తుగా అడ్మిషన్లు చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి నగరంలో పెద్దపెద్ద హోర్డింగ్‌లను సైతం ఏర్పాటు చేస్తోందన్నారు. నగరంలో ఏర్పాటుచేసిన ప్రచార ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలను ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. రాంనగర్‌ బ్రాంచిలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కేంద్రాన్ని తక్షణం మూసి వేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిద్దు, భీమేష్‌, సోము, వీరు, మతేష్‌, నరసింహా, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ, నగర అధ్యక్ష, కార్యదర్శులు మంజునాథ్‌, ఉమామహేష్‌, నాయకులు హరికష్ణ, నారాయణస్వామి పాల్గొన్నారు.

➡️