ఎస్‌కెయు పూర్వ విసి అవినీతిపై విచారణ జరపాలి

ఎస్‌కెయు పూర్వ విసి అవినీతిపై విచారణ జరపాలి

పసుపునీళ్లతో ఎడి బిల్డింగ్‌ను శుభ్రం చేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు

           అనంతపురం కలెక్టరేట్‌ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ రామకృష్ణారెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఓతురు పరమేష్‌, కుళ్లాయిస్వామిలు డిమాండ్‌ చేశారు. విసి రామకృష్ణారెడ్డి పదవీకాలం ముగియడంతో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌ఎ ఆధ్వర్యంలో శనివారం నాడు ఏడీ బిల్డింగ్‌ మెట్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విసి రామకష్ణారెడ్డి మూడు సంవత్సరాలుగా యూనివర్సిటీని అన్ని విధాలా నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. ఆయన హయాంలో కొన్ని డిపార్ట్‌మెంట్‌లో జీరో అడ్మిషన్ల స్థాయికి మార్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను వేధిస్తూ కొంతమంది ఉద్యోగుల ప్రాణాలు కోల్పోవడానికి కూడా వైస్‌ ఛాన్సలర్‌ కారణమయ్యాడన్నారు. యూనివర్సిటీలో పని చేస్తున్న కొంత మంది వర్కర్లను విసి స్వగ్రామం వేంపల్లి పొలంలో పని చేయడానికి 10 రోజులకు ఐదు మంది వర్కర్లను తీసుకు వెళ్లేవారన్నారు. విసిగా కాకుండా అధికార పార్టీ కార్యకర్తగా ఆయన పని చేశారని విమర్శించారు. ఉన్నతాధికారులు ఈయన ఉద్యోగ సమయంలో జరిగిన ప్రతి పనిపైనా విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు వేమన, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గిరి, శివ, భీమేష్‌ పాల్గొన్నారు.

➡️