ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నా..

ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నా..

విలేకరులతో మాట్లాడుతున్న ఎం.వీరాంజనేయులు

ప్రజాశక్తి-శింగనమల

‘ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నా.. ఎంఎ, బిఇడి చేశా..’ అయితే టిప్పర్‌ డ్రైవర్‌ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం బాధాకరమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. శుక్రవారం శింగనమల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. అదే టిడిపి అధినేత చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీలంటే చులకన భావం అన్నారు. ఎందుకంటే బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను హేళన చేస్తూ మాట్లాడటం ఇందుకు నిదర్శనమన్నారు. ఒక టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చారని ఎగతాళిగా మాట్లాడటం, చదువురాని వేలిముద్రకే టిక్కెట్టు ఇచ్చారా.. అంటూ హేళనగా మాట్లాడటం బాధాకరమన్నారు. తాను టిప్పర్‌ డ్రైవర్‌గా, మడకశిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలీగా పని చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. కుటుంబం పోషించుకోవడానికి టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేశాను తప్ప.. క్లబ్‌ల్లో డాన్స్‌ లేసి సంపాదించుకోలేదని ఎద్దేవా చేశారు. తమది పేదల పార్టీ కాబట్టే జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారన్నారు. మీది పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. పేద దళిత కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నానన్నారు. అంతేగాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నందుకు సంతోషపడుతున్నానన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు అద్భుతమైన విజన్‌ ఉందన్నారు. ఇకపోతే తమ ఎమ్మెల్యే వాళ్లు తనను బినామీగా పెట్టుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితం అంతా బినామీలతో వస్తోందని, అందుకే ఆయనకు అలవాటు అయిందన్నారు. రానున్న రోజుల్లో టిడిపికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.

➡️