ఓపీఎస్‌ అమలు చేసే వారికే ఓటేద్దాం

ఓటఫర్‌ ఓపీఎస్‌ పోస్టర్లను విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే పార్టీలకే ఓటు వేద్దామని యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌వివి.రమణయ్య తెలిపారు. గురువారం నాడు రాప్తాడు ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఓట్‌ఫర్‌ ఓపిఎస్‌ పోస్టర్‌లను మండల విద్యాశాఖ అధికారులు మల్లికార్జున, కుళ్లాయప్ప, యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రమణయ్యల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకుని పాత పెన్షన్‌ విధానం అమలు చేసేలా ఆయా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ స్థానంలో తీసుకొచ్చిన జిపిఎస్‌ను రద్ధు చేయాలన్నారు. కాంట్రాక్ట్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి పాత పెన్షన్‌ విధానం వారికి కూడా అమలు చేయాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని కోరారు. ఆ పార్టీలకే తమ ఓటు ఉంటుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాప్తాడు మండల అధ్యక్షుడు బి.గంగాధర్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వెంకటనాయుడు, నాయకులు చంద్రారెడ్డి, రాజకుళ్లాయప్ప పాల్గొన్నారు.

➡️