‘కె-6’కు కాలం చెల్లింది..

'కె-6'కు కాలం చెల్లింది..

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి యు.ఉమామహేశ్వరి

ప్రజాశక్తి-అనంతపురం

జిల్లాలో ఖరీఫ్‌, రబీలో సాగు చేస్తున్న కె6-రకం వేరుశనగ విత్తనానికి కాలం చెల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారణి యు.ఉమామహేశ్వరమ్మ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వివిధ పంటల్లో కొత్త వంగడాలను ప్రవేశపెట్టేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ సహాయ సంచాలకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వేరుశనగ పంటలో ప్రధానంగా కే-6 రకాన్ని జిల్లాలో అధికశాతం మంది రైతులు సాగు చేస్తున్నారన్నారు. ఈ రకం జిల్లాలో 10ఏళ్లకు పైబడి సాగు చేయడం వల్ల దిగుబడులు తగ్గి నష్టం వాటిళ్లుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే రకాలను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. కనీసం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు నూతన వేరుశనగ విత్తనాలను అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వేరుశనగ పంటలో వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులను ఇచ్చే కదిరి-9, కదిరి, లేపాక్షి -18, 12, టిజిసిజి-1694 (వశిష్ట) రకాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అలాగే కంది పంటలో ఎల్‌ఆర్‌జి-41 రకానికి బదులు పిఆర్‌జి-176 రకం, కొర్ర పంటలో సూర్యనంది, గరుడ రకాలను సూచించామన్నారు. ఈకార్యక్రమంలో రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డి, వేరుశనగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రసన్నరాజేష్‌, కెవికె కోఆర్డినేటర్లు మల్లేశ్వరి, రాధాకుమారి, డివిజన్‌ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.రవి, యల్లప్ప, పద్మజ, వెంకటరాముడు, గురుమూర్తి, సాంకేతిక వ్యవసాయ అధికారులు రాకేష్‌నాయక్‌, వెంకట్‌కుమార్‌, బాలానాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️