గ్రూప్‌-1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణపై అధికారులతో మాట్లాడుతున్న మేయర్‌, డిఆర్వో తదితరులు

         అనంతపురం : ప్రభుత్వం ఈనెల 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రూప్‌- 1 పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,597 మంది పరీక్షలు రాయనున్నారు. గ్రూప్‌-1 పరీక్షల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం నాడు అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌ ఆధ్వర్యంలో లైజన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్‌ రెడ్డి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్‌ సెక్రటరీ కె.శ్రీనివాసులు, సెక్షన్‌ ఆఫీసర్లు యోగేశ్వరరావు, వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్‌ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ ఆదివారం ఏపీపీఎస్సీ, గ్రూప్‌-1 సర్వీసెస్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలను 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒక విభాగం, మధ్యాహ్నం 02 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 11,597 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలియజేశారు. ఇందుకోసం 33 మంది లైజన్‌ ఆఫీసర్లు, 33 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లను నియమించినట్లు పేర్కొన్నారు. ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకుండా పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక పరీక్ష కేంద్రాల్లో వెలుతురు, సీటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా జరగాలన్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లను మూసి వేయించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎపిసి వరప్రసాద్‌, ఎస్‌డిసిలు శంకరయ్య, ఆనంద్‌, డీపీఒ ప్రభాకర్‌ రావు, సిపిఒ అశోక్‌ కుమార్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️