చంపేసి.. శరీరాన్ని ముక్కలుగా కోసి.. నదిలో పడేశారు..!

హత్యకు గురైన వృద్ధురాలు ఓబుళమ్మ (ఫైల్‌ఫొటో)

          గార్లదిన్నె : అనంతపురం జిల్లాలో అత్యంత దారుణఘటన చోటు చేసుకుంది. పెళ్లిలో వేసుకునేందుకు తీసుకున్న తన బంగారు నగలు ఇచ్చేయాలని కోరినందుకు ఓ వృద్ధురాలిని అత్యంతదారుణంగా హత్య చేశారు. శరీరాన్ని ముక్కలుముక్కలు చేసి భాగాలను పెన్నానదిలో పడేశారు. కిరాతకుల్లా వ్యవహరించి వృద్ధురాలి ప్రాణాన్ని తీసేశారు. సభ్యసమాజం నిర్ఘాంతపోయేలా వ్యవహరించి వారి క్రూరత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం డీఎస్పీ వెంకటశివారెడ్డి, సిఐ శ్రీధర్‌, ఎస్‌ఐ గౌస్‌లు విలేకరులకు వెళ్లడించారు. గార్లదిన్నె మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఓబుళమ్మ(85)కు ఎవరూ లేరు. భర్త మరణించగా ఒక్కతే ఉంటోంది. తన తమ్ముడు శివ శంకర్‌రెడ్డి వ్యవసాయ పొలంలో కూలీలతో పనులు చేయిస్తూ సాయంగా ఉండేది. వీరి పొలం పక్కనే పొలాన్ని కౌలుకు తీసుకుని బీరే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పంటలు సాగు చేసుకునేవారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన శుభకార్యానికి బంగారు నగలు అవసరం అని, రెండు రోజుల్లో వాటిని తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఓబుళమ్మతో ఏడు తులాల బంగారు నగలను బీరే కృష్ణమూర్తి తీసుకెళ్లారు. 50 రోజులు అవుతున్నా కృష్ణమూర్తి బంగారు నగలను వెనక్కు ఇవ్వలేదు. పలుమార్లు ఓబుళమ్మ నగలు ఇవ్వాలని కోరినా ఏదోఒకటి చెప్పి తప్పించుకుని తిరిగేవాడు. కాగా కృష్ణమూర్తి వృద్ధురాలితో తీసుకున్న బంగారు నగలను అనంతపురంలోని ఒక ప్రయివేటు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2.80లక్షలకు డబ్బులు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఓబుళమ్మ తన బంగారు నగలు ఇవ్వాల్సిందే అంటూ కృష్ణమూర్తిపై ఒత్తిడి చేసింది. తాకట్టు పెట్టిన బంగారు నగలను ఇవ్వలేని కృష్ణమూర్తి వృద్ధురాలిని వదిలించుకుంటే ఈ సమస్య తీరుతుందని భావించాడు. ఇందులో భాగంగా ఏకంగా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన కుమారులు బీరే భరత్‌, బీరే లోకనాథ్‌, భార్య బీరే లక్ష్మీదేవికి చెప్పాడు. అందరూ కూడగలుపుకుని వృద్ధురాలిని హత్య చేసేలా పతకం పన్నారు. ఇందులో భాగంగా బంగారు నగలను ఇస్తానని చెప్పి ఈ నెల 21వ తేదీ గురువారం నాడు ఓబుళమ్మను నమ్మించి తాను కౌలుకు చేస్తున్న వరి పొలం వద్దకు కృష్ణమూర్తి తీసకెళ్లాడు. ముందస్తుగా పతకం రచించిన మేరకు కుమారులతో కలిసి గొడ్డలితో నరికి ఓబుళమ్మను దారుణంగా హత్య చేశారు. అనంతరం అందరూ కలిసి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ముక్కలుముక్కలుగా చేసి శరీర భాగాలను ఓ గోనే సంచిలో వేసుకుని ట్రాక్టర్లో పామిడి మండలం కోనేపల్లి దగ్గర పెన్నా నదిలో పారవేశారు. అనంతరం ఏమీ తెలియని వారిలా అందరూ గ్రామానికి వచ్చేశారు. ఓబుళమ్మ కనబడకపోవడంతో ఆమె మేనకోడలు శివలక్ష్మి గార్లదిన్నె పోలీస్‌ స్టేషన్లో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వృద్ధురాలిని వెతికే క్రమంలో కృష్ణమూర్తి పోలీసులు, గ్రామస్తులతో కలిసి తిరిగాడు. ఫిర్యాదు చేసే సమయంలో కూడా అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఏమీ తెలియని వాడిలా నటించాడు. గురువారం రాత్రి గ్రామంలోని కొందరు ఓబుళమ్మను కృష్ణమూర్తి ద్విచక్రవాహనంలో ఎక్కించుకని వెళ్లాడని ఆమె తమ్ముడు శివశంకర్‌రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన అనుమానం వచ్చి పోలీసులకు ఈ సమాచారం తెలియజేశాడు. వెంటనే పోలీసులు కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో కృష్ణమూర్తి తానే హత్య చేసి మృతదేహం విడిభాగాలను పెన్నానదిలో పడవేశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ మాట విని నిర్ఘాంతపోయిన పోలీసులు నిందితున్ని శుక్రవారం ఉదయం పెన్నానది వద్దకు తీసుకెళ్లి వృద్ధురాలి శరీర భాగాలను బయటకు తీయించారు. హత్య చేసిన కృష్ణమూర్తితో పాటు సహకరించిన అతని ఇద్దరు కుమారులు, భార్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

➡️