శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత : ఎస్పీ

నెలవారీ నేర సమీక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ గౌతమిసాలి

       అనంతపురం క్రైం : శాంతి, భద్రతల పరిరక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలని ఎస్పీ గౌతమిసాలి పిలుపునిచ్చారు. జిల్లాలోని పోలీసు, సెబ్‌ విభాగం అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించారు. జిల్లాలో నమోదైన ఎంసిసి కేసులు, పోక్సో, గ్రేవ్‌ యూఐ, ఎస్సీ ఎస్టీ, మహిళలపై జరిగిన నేరాలు, తదితర కేసులను సబ్‌ డివిజన్‌ల వారీగా సమీక్ష చేశారు. ఈ కేసుల్లో మరింత పురోగతి సాధించాలని ఎస్పీ సూచనలు చేశారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకుల కదలికలపై నిఘా వేయాలన్నారు. ప్రస్తుతం వారి తాజా సమాచారం, పరిస్థితులు, ప్రవర్తన తీరుపై ఆరా తీయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ గట్టి సంకల్పం, కార్యాచరణ ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల కట్టడికి పని చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రకారంగా వీటికి పరిష్కారం ఎలా చూపాలో తెలియజేశారు. మట్కా, పేకాట, మత్తు పదార్థాలు, నాటుసారా, కట్టడి పక్కాగా ఉండాలని, జిల్లాలో ఎక్కడ జూదం జరిగినా సహించబోమని హెచ్చరించారు. ఎవరైనా ప్రోత్సహించినా, సంబంధాలు కొనసాగించినా చర్యలు తప్పవన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌ పెంచాలన్నారు. బేసిక్‌ పోలీసులో భాగంగా డ్రంకన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌, పెట్టీ కేసులపై దష్టి సారించాలన్నారు. రికార్డుల నిర్వహణ మంచిగా ఉండాలన్నారు. పేకాట, నాటుసారా, కర్నాటక లిక్కర్‌పై దాడులకు వెళ్లిన సందర్భాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రకతి వైపరీత్యాలు, విఐపిల భద్రత, సంచలనాత్మక నేరాలు జరిగిన సమయాల్లో పోలీసులు ఏమి చేయాలో ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయ భాస్కర్‌ రెడ్డి, జి.రామకృష్ణ, డీఎస్పీలు ఎం.ఆంథోనప్ప, టివివి.ప్రతాప్‌, బి.శ్రీనివాసులు, శివభాస్కర్‌ రెడ్డి, మునిరాజతో పాటు పోలీసు, సెబ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️