‘చలో ఢిల్లీ’కి మద్దతుగా నిరసన

'చలో ఢిల్లీ'కి మద్దతుగా నిరసన

నిరసన వ్యక్తం చేస్తున్న రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-పామిడి

మార్చి 14న రైతుసంఘాలు పిలుపునిచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా రైతుసంఘం మండల కార్యదర్శి ముత్యాలు, సీనియర్‌ నాయకులు అనిమిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 540 రైతుసంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌మోర్చా ఈనెల 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పిలుపునిచ్చిందన్నారు. ఈ సభకు మద్దతుగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు గొంతెత్తి నినదించాలన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం 2021 డిసెంబర్‌ లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతన్నలను హర్యానా సరిహద్దుల్లో అడ్డగించడం అన్యాయమన్నారు. బిజెపి ప్రభుత్వం రైతాంగంపై కర్కశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాలుగు సార్లు చర్చలు జరిపినా పురోగతి సాధించలేదన్నారు. మంత్రులు ఇతర విషయాలు చర్చిస్తున్నారే తప్ప మద్దతు ధరల చట్టం గురించి మాట్లాడడం లేదన్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధరల చట్టం చేస్తే ప్రభుత్వంపై రూ.లక్షలు కోట్ల ఆర్థిక భారం పడుతుందని అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. రద్దు చేసిన నల్లచట్టాల విధానాలనే అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని అదాని, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎరువులపై రాయితీల్లో కోతలు విధించడం, ఆహార భద్రతా చట్టం అమలులో కోత విధించి కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్నారన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, రైతు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లను రద్దుచేసి, కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీకి బడ్జెట్‌లో రూ.2లక్షల కోట్లు కేటాయించి 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. భూహక్కు చట్టాన్ని ఉపసంహరించాలని, చుక్కల భూములు, బంజర భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మల్లేష్‌, రైతుసంఘం నాయకులు ఈశ్వరయ్య, కిష్టప్ప, బాబా ఫక్రుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️