పంట నష్టపరిహారం.. మాటలకే పరిమితమా..? : సిపిఎం

కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో మాట్లాడుతున్న వి.రాంభూపాల్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : ఖరీఫ్‌, రబీ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మాటలకే పరిమితం అయ్యిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ విమర్శించారు. జిల్లాలో రైతులకు పంట నష్టపరిహారం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం నాడు ధర్నా నిర్వహించారు. అంతకు మునుపు రైతులు, పేదలతో కలిసి సంగమేష్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో రాంభూపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంత వరకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదన్నారు. సంక్రాంతి పండుగ నాటికి చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా రూ.6వేల కోట్లను రైతులు పెట్టుబడి రూపంలో నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ అధికారులు 1,79,815 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచాన వేసి కేవలం రూ.300 కోట్లు మాత్రమే నష్టం జరిగినట్లు అంచనాలు వేయడం విచారకరం అన్నారు. ఇది రైతులను తీవ్రంగా దగా చేయడమే అన్నారు. వేరుశనగ పంట సాగుకు ఎకరాకు కనీసం రూ.35 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు వస్తుందన్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.6 వేలు నష్టపరిహారంగా నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇతర పంటల విషయంలో కూడా ఇదే రకమైన తక్కువ పరిహారాన్ని చూపి రైతులను మోసం చేస్తున్నారన్నారు. పంటలు సాగు చేసి రూ.6 వేల కోట్లు జిల్లా రైతులు నష్టపోతే కేవలం రూ.251 కోట్లు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో కౌలు రైతులను గుర్తించి, వారికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో పట్టణాలు, మండల కేంద్రాలకు పేదలు వలసలు వస్తున్నారని తెలిపారు. వీరు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే వెంటనే నకిలీ పట్టాదారులు అధికారులను ఉపయోగించి ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. వీరికి అధికార పార్టీ నాయకులు కొందరు అండగా ఉంటున్నారని విమర్శించారు. అనంతపురం రాజీవ్‌ కాలనీ పంచాయతీలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి రక్షణ కల్పించాలన్నారు. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ఇళ్లను తొలగించిన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిఆర్‌ఒ రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య, ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, ఎస్‌.నాగేంద్రకుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు వెంకటనారాయణ, ముస్కిన్‌, మండల నాయకులు చెన్నారెడ్డి, మసూద్‌, ప్రకాష్‌, వెంకటేష్‌, శ్రీనివాసులు, రాజు, నల్లప్ప, సంగప్ప, పుల్లన్న పాల్గొన్నారు.

➡️