పురం వాసికి పద్మశ్రీ

పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీధర్‌

           హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ వాసి శ్రీధర్‌కు దేశం గర్వించ దగ్గ పద్మశ్రీ అవార్డు దక్కింది. శ్రీధర్‌ హిందూపురం పట్టణంలోని ఎస్‌డిజిఎస్‌ కళాశాలలో 1973-76 సంవత్సరంలో బీకాం పూర్తి చేశారు. అనంతరం ఇదే కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహించారు. బెంగుళూరు యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగానికి ప్రొఫెసర్‌, డీన్‌, డైరెక్టర్‌గానూ పనిచేశారు. బెంగుళూరులోని చాణక్య యూనివర్శిటీ ఛాన్సలర్‌గా పని చేశారు. 2009 నుంచి 2013 వరకు కర్నాటక నాలెడ్జ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ డ్రాఫ్టింగ్‌ కమిటీలో సభ్యులు, ఆల్‌ ఇండియా బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఎఐసిటిఇ సభ్యులు, ప్రస్తుతం యుజిసి న్యూఢిల్లీ సభ్యులు, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌గా ఉన్నారు. విద్యారంగంలో శ్రీధర్‌ చేసిన సేవలను గుర్తించి కర్ణాటక ప్రభుత్వం కర్నాటక రాజ్యోత్సవ అవార్డు, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ నుంచి జనరల్‌ ప్రెసిడెంట్‌ గోల్డ్‌ మెడల్‌తో సత్కరించారు. ప్రస్తుతం ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. శ్రీధర్‌ మేనేజ్‌మెంట్‌లో స్ఫూర్తిదాయకమైన ప్రొఫెసర్‌, పరిశోధకుడు, ఇన్‌స్టిట్యూషన్‌ బిల్డర్‌, వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకులు. నలభై సంవత్సరాలకు పైగా బోధన, పరిశోధన అనుభవం ఉంది. హిందూపురం నుంచి గతంలో పద్మశ్రీ అవార్డు కల్లూరు సుబ్బారావుకు వచ్చింది. ఇప్పుడు ఎంకె.శ్రీధర్‌కు పద్మశ్రీ రావడంపై పురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ విద్యాసాగర్‌ పద్మశ్రీ శ్రీధర్‌ కలిసి చదువుకున్నారు.

➡️