మట్టి తిని బతకాలా..?

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట మట్టిని తిని నిరసన తెలపుతున్న అంగన్‌వాడీలు

         అనంతపురం కలెక్టరేట్‌ : ‘నిత్యావసరాల ధరలు పెరిగాయి.. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, వంటి అనేక సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలు తీరాలంటే కనీస వేతనాలు అవసరం. ఏళ్ల తరబడి పని చేస్తున్నాం. మాకు కనీస వేతనాలు ఇవ్వకపోతే మట్టి తిని బతమంటారా..?’ అంటూ అంగన్‌వాడీ కార్మికులు నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 36వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో అంగన్‌వాడీలు వినూత్న పద్ధతుల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఒక్కొక్క డివిజన్‌ నుంచి ఒక్కొక్క రోజు 12 చొప్పున 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మండుటెండలో శిబిరంలో బైటాయించి ఆందోళన కొనసాగించారు. పండుగ రోజు అని కూడా లేకుండా హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్మికుల యూనియన్‌ జిల్లా కోశాధికారి జమన అధ్యక్షతన నిర్వహించిన దీక్షలకు సిఐటియు నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, జిల్లా ఉపాధ్యక్షుడు మన్నీల రామాంజినేయులు మద్దతుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీల పట్ల అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. 36 రోజులుగా సమ్మె చేస్తుంటే చర్చల పేరుతో కాలయాపన చేయడం అన్యాయంగా ఉందన్నారు. ఆర్థికేతర అంశాలపై మాట్లాడేందుకు చర్చలకు పిలవడం ప్రభుత్వం దగాకోరు తనానికి నిదర్శనం అన్నారు. ఆర్థికపరమైన డిమాండ్‌లతో సమ్మె చేస్తుంటే అది కాకుండా ఇతర సమస్యలను పరిష్కరిస్తామంటూ చెప్పడం సరికాదన్నారు. తక్షణమే వేతనాలు పెంపుదల చేసి కార్మికుల సమ్మెను విరమింపజేయాలని కోరారు.

➡️