రైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి

కరువు బృందానికి వినతిపత్రం అందజేస్తున్న ఎపి రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ రూ.10వేల కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తరిమెల నాగరాజు, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు బృందానికి రైతుసంఘం నేతలు కందుకూరు వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోయారని వివరించారు. ప్రభుత్వాలు స్పందించి కరువు నివారణకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు. అలాగే రైతుల పంట రుణాలు ప్రయివేట్‌ అప్పులతో సహా ఒకేసారి మాఫీ చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పంట నష్టపరిహారం ఎకరాకు రూ.10 వేలు వరకు ఇవ్వాలన్నారు. డ్రిప్‌, స్ప్రింక్లర్లపై జిఎస్‌టి రద్దు చేసి, దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు వెంకటరెడ్డి, టి.రామాంజినేయులు, మన్నీల సర్పంచి త్రిలోక్‌నాథ్‌, గంగాధర్‌, వెంకటనారాయణ, బి.చంద్రశేఖర్‌రెడ్డి, రామలింగమయ్య, సూర్యనారాయణ, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని వినతికేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ఎపి కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఎం.బాలరంగయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం మన్నీల గ్రామంలో కేంద్ర కరువు బృందాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది కౌలు రైతులు కౌలుకు పంటలు సాగు చేసి పెద్ద ఎత్తున నష్టపోయారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో 20 వేలకు పైబడి కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కేవలం 5 వేల మందికి మాత్రమే సిసిఆర్‌సి కార్డులు జారీ చేసిందన్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముందస్తుగా కౌలు చెల్లించి రైతులు పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పంట నష్టపరిహారం భూ యజమానులకు వస్తుందని, పంటలు వేసి నష్టపోయిన కౌలు రైతులకు మాత్రం నయా పైసా కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.

➡️