రైల్వే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

 

 

సిఐటియు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ల ముందు ఆందోళన

ప్రజాశక్తి-గుంతకల్లు

కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు, ముఖ్యంగా రైల్వే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్‌, సాకే నాగరాజు డిమాండ్‌ చేశారు. రైల్వే ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ రైల్వేలో 7325 రైల్వేస్టేషన్లు, 1,26,366 కిమీ రైల్వేట్రాక్‌ నెట్‌వర్క్‌, 13,169 ప్రయాణికుల రైళ్లు (మెయిల్‌, ఎక్స్‌ ప్రెస్‌, పాసింజర్స్‌తో సహా,) 1246 గూడ్స్‌ షెడ్లు, 5 పర్వత ప్రాంత రైల్వేలు, అనేక రైల్వే స్టేడియంలు ఉన్నాయన్నారు. దేశంలో అతిచౌకయిన ప్రయాణం, సరుకుల రవాణా చేస్తున్న భారత రైల్వేల ధ్వంసానికి, రూ.లక్షల కోట్ల రైల్వే ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా 400 రైల్వేస్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 14 వేల రైల్వేట్రాకు, కొంకణ్‌ రైల్వే 741 కిమీ, 1.5 రైల్వే స్టేడియాలు, ఎంపిక చేసిన 265 రైల్వే కాలనీలు, 300 గూడ్స్‌ షెడ్లు, 4 పర్వత ప్రాంత రైల్వేలును రూ.1,52,496 కోట్ల నగదీకరణ కోసం ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రైల్వేస్టేషన్లు, చుట్టు పక్కల ఉన్న స్థలాలను ఆదానీ, అంబానీలకు నామమాత్రపు లీజుకు కట్టబెట్టేందుకు సిద్ధమైందన్నారు. వాటిలో హోటళ్లు, మాల్స్‌, యమ్యూజ్మెంట్‌ పార్కులు మొదలగు విచ్చలవిడి వ్యాపారాలు చేస్తూ వేల కోట్ల ఆదాయం వారికి అప్పజెబుతున్నారన్నారు. లాభాలొచ్చే 150 రైల్వే రూట్లు కార్పొరేట్లకిచ్చి, లాభాలు రాని గ్రామీణ ప్రాంత రూట్లను మూసేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైలు ఇంజిన్లు, తయారీ, వ్యాగన్లు, బోగీలు, చక్రాలు తయారు చేసే ఏడుసంస్థలను ప్రయివేటు వారికే కట్టబెడుతోందన్నారు. విచ్చలవిడిగా రైల్వేల ప్రయివేటీకరణ విధానాలు అమలవుతున్నందునే తరుచుగా రైలు ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఇప్పటికే బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రైలు ప్రమాదాలు రెట్టింపు అయ్యాయన్నారు. ఇటీవల ఒరిస్సాలోని బాలాసోర్‌ వద్ద, మన రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదాలకు సిగలింగ్‌ వ్యవస్థ, ట్రాక్‌ మెయిన్టినెన్స్‌ నిర్వహణ తదితర సేఫ్టీ విభాగాలను ప్రయివేటు వ్యక్తుల్లోకి పెట్టడం ద్వారా భద్రతా ప్రమాణాలు లేకుండా పోయాయన్నారు. కావున రైల్వే ప్రయివేటీకరణను దేశ ప్రజలు అందరూ కలిసికట్టుగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చరణ్‌ప్రతాప్‌, చొక్కా సునీల్‌, వైటిసి.రమేష్‌, తిమ్మప్ప, షబ్బీర్‌, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం : కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు, ముఖ్యంగా రైల్వే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున పిలుపునిచ్చారు. రైల్వే ప్రయివేటీకరణ, మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల పట్ల వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్‌ ముందు ధర్నా చేపట్టారు. మల్లికార్జున మాట్లాడుతూ దేశ ప్రజల ఆస్తిగా చెప్పుకునే రైల్వేను మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయివేటీకరణ విధానాలను సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రైల్వేను ప్రయివేటుపరం చేస్తే ప్రయాణికులపై విపరీతమైన భారాలు పడతాయని, రైల్వే ఉద్యోగులు, కార్మికులకు భద్రత లోపిస్తుందన్నారు. ఇకనైనా మోడీ ప్రభుత్వం రైల్వే ప్రయివేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రయాణికులకు భద్రత కల్పించాలని, రైల్వేలో ఖాళీగా ఉన్న 3.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, మధు, అంజి, రమేష్‌, కృష్ణనాయక్‌, హనుమంతు, ఓబులేష్‌, బాబు, శివ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ, డివైఎఫ్‌ఐ నాయకులు అనిల్‌, వీరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️