విగ్రహాల వివాదం..!

విగ్రహాల వివాదం..!

టిప్పూసుల్తాన్‌, శ్రీకృష్ణదేవరాయులు

    అనంతపురం ప్రతినిధి : విగ్రహాల చుట్టూ వివాదాన్ని రాజే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు కదిరి, ఇటు అనంతపురం నగరంలో రెండు చోట్లా విగ్రహాల ఏర్పాటు వివాదానికి దారితీస్తోంది. విగ్రహాల ఏర్పాటుకు మతం రంగు పులుమేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు చోట్ల సమస్యాత్మకంగా మారుతోంది. కర్నాటకలోనూ గతంలో టిప్పుసుల్తాన్‌ అంశంపై పెద్దఎత్తున వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాకు విస్తరించే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు కనిపిస్తున్నాయి. విగ్రహం ఏర్పాటు చేసి తీరుతామని కొంత మంది… పగులగొడతామంటూ మరికొంత మంది.. చేస్తున్న ప్రకటనలు వివాదాలకు ఆజ్యం పోసే విధంగా ఉన్నాయి.అనంతపురం నగరంలో 20 శాతానికిపైగా ముస్లిం జనాభా ఉన్నా ఎప్పుడూ మతపరమైన ఇబ్బందులు తలెత్తిన దాఖలాల్లేవు. మత సామరస్యానికి ప్రతీకగా అనంతపురం నగరంలో ఉంటుంది. గుడి, మసీదులు పక్కపక్కనే ఉన్నా కలసిమెలసి పోతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఇటువంటి చోట విగ్రహం ఏర్పాటుపై స్థానికంగా అందరూ కలసి కట్టుగానే ముందుకొస్తున్న తరుణంలో బిజెపి నేతలు ఏర్పాటును అడ్డుకుంటామని ప్రకటనలు చేయడం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. రెండింటినీ నగరవాసులు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిప్పువిగ్రహం ఏర్పాటుపై వస్తున్న వివాదానికి పుల్‌స్టాప్‌ పెట్టే విధంగా అందరితో కలిపి అనంతపురం నగరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఏ మేరకు సానుకూలత వస్తుందన్నది చూడాల్సి ఉంది. అటు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోనూ టిప్పుసుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగానూ బిజెపి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అక్కడే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ఏర్పాటు అంశం కూడా వివాదాస్పదమైంది. శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు అనుమతుల్లేకుండా రహదారిలో పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కదిరి పట్టణం ముందు నుంచి సున్నితమైన ప్రాంతంగా ఉంది. గతంలో పలుమార్లు ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విగ్రహాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇకపోతే విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కొన్ని విధి విధానాలున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరిగ ఉండాలి. అదే విధంగా జిల్లా కలెక్టర్‌ అనుమతులూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే విగ్రహాలు ఏర్పాటు సాధ్యమవుతుంది. పైరెండు చోట్ల కూడా ఏ మేరకు అనుమతులు తీసుకున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. అధికారిక అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసి ఎన్నికల సమయంలో వివాదాన్ని చేయడం సరైంది కాదని మేధావులు సూచిస్తున్నారు.

➡️