సం’కుల’ సమరం..!

సం'కుల' సమరం..!

పొలిటికల్‌ గేమ్‌

           అనంతపురం ప్రతినిధి : ఎన్నికలు సమీస్తున్న తరుణంలో కులాల సమరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తమ కులానికి ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్లను వినిపిస్తున్నాయి. అయితే వీటి వెనుక ఆయా రాజకీయపార్టీల నేతలూ ఉంటుండటం గమనార్హం. మొత్తంగా ఆ కులాల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తాము అధిక ప్రాధాన్యతనిచ్చామంటే.. తామూ ఇచ్చామంటూ చెప్పుకుని ఆ కులం మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అనంతపురం నగరంలో కురుబసంఘం గుడికట్ల సంబరాల పేరుతో పెద్దఎత్తున కుల సమీకరణ చేపట్టారు. భారీగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 250 గుడికట్లు కూడా వచ్చాయి. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయపార్టీల నుంచి నేతలు పాల్గొని ఆ కులంలో తమకు మద్దతు ఉన్నట్టు చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులోనూ గోరంట్ల మాధవ్‌, బికె.పార్థసారధిల మధ్య వివాదం చోటు చేసుకుంది. రాజకీయాలకు అతీతమైన ఈ సభలో వివాదం సరైంది కాదని కుల పెద్దలు సర్దిజెప్పాల్సి వచ్చింది. ఇదే సమయంలో బోయ సామాజిక తరగతికి ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్‌ వినిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సత్యసాయి జిల్లాలో బోయలకు ప్రాధాన్యత లేదన్న అభిప్రాయాన్ని ఆ కుల సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. 1980 దశకంలో గంగాధర్‌కు హిందూపురం ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఎవ్వరికీ తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతను కల్పించలేదన్న వాదనలను బోయలు వినిపిస్తున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతల వద్ద కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్టు చర్చ నడుస్తోంది. వైసిపి మాత్రం రెండు బోయలు, కురబలు ఇద్దరికీ అధిక ప్రాధాన్యతను కల్పించామని చెబుతున్నారు. వడ్డేర్లు, యాదవలు ఇతర కుల సంఘాలు తమకు తగిన ప్రాధాన్యతను కల్పించలేదని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కులాలకు అసెంబ్లీగాని, పార్లమెంటు స్థానాలుగానీ కేటాయించ లేదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సామాజిక తరగతులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ను వినిపిస్తున్నాయి. ఇక మైనార్టీలు, బలిజ సామాజిక తరగతికి చెందిన వారు కూడా తమకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ ముందుకు తెస్తున్నారు. గత ఎన్నికల్లో ఎప్పుడు ఏ సామాజిక తరగతికి ప్రాధాన్యతలు ఏ విధంగా కల్పించారన్న బేరీజులు సైతం వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కొన్ని మార్పులతోనే టిక్కెట్లు కేటాయించే అవకాశాలున్నాయన్న చర్చ కూడా నడుస్తోంది. ఇలా ఎన్నికలకు ముందు కులాల కుంపట్లు మొదలయ్యాయి. ఈ ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి, జిల్లా సమస్యల కంటే ఈ అంశాలు ముందుకు రావడం గమనార్హం. వామపక్షాలు అందులోనూ సిపిఎం జిల్లా సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మేధావులతో సదస్సులు నిర్వహించారు. అదే విధంగా బస్సు యాత్ర, స్కూటర్‌ యాత్రలను చేపట్టింది. ఇందులో అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

➡️