సిఎఎతో ప్రజల ఐక్యతకు విఘాతం : సిపిఎం

సిఎఎకు వ్యతిరేకంగా అనంతపురం టవర్‌క్లాక్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు

           అనంతపురం కలెక్టరేట్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి, ప్రజల ఐక్యతకు విఘాతం కలిగించే చర్యలకు పూనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్యని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో టవర్‌ క్లాక్‌ దగ్గర మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ వివక్షా పూరిత చట్టం అమలుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఇది ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుందని విమర్శించారు . ఫాసిస్టు హిందుత్వాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. బిజెపి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్ధేశంతోనే ఈ బిల్లును హడావుడిగా అమల్లోకి తెచ్చారన్నారు. వివక్షతను చూపే పౌరసత్వ సవరణ చట్టాన్ని గతంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో బిజెపి ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని తెలియజేశారు. కేరళ రాష్ట్రంలో సిఎఎను అమలు చేయమని అక్కడి వామపక్ష ప్రభుత్వం తేల్చిచెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశంలో ప్రజల మధ్య చీలికతెచ్చి కల్లోలం రేపాలన్న లక్ష్యంతోనే బిజెపి సిఎఎను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే ఈ చట్టాన్ని దేశ ప్రజలంతా ఐక్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయకుండా ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. బలవంతంగా సిఎఎను అమలు చేయాలని చూస్తే ప్రజల మద్దతుతో రానున్న ఎన్నికల్లో బిజెపి, దాన్ని బలపరుస్తున్న మిత్ర పక్షాలను ప్రజలందరూ ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటనారాయణ, నగరకమిటీ నాయకులు బాలకృష్ణ, రాజు, గపూర్‌, వెంకటేశ్‌, లక్ష్మీనారాయణ, బాబా, ఎర్రిస్వామి, శంషాద్‌, రవి, ఆనంద్‌, రామాంజనేయులు, లక్ష్మీదేవి, ఫక్రున్ని, రవి, మాభ్బీ పాల్గొన్నారు.

➡️