సిఐటియు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి

సిఐటియు కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు, సిఐటియు కాలనీవాసులు

ప్రజాశక్తి-గుంతకల్లు

పట్టణంలోని సిఐటియు కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు కాలనీవాసులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ఏర్పడి 30 ఏళ్లు గడిచినా కనీసం మౌలిక వసతులు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ప్రధానంగా తాగునీటి వసతి లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతోపాటు సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఆఖరికి నివాసం ఉంటున్న ఇళ్లకు మున్సిపల్‌ అధికారులు ఇంటి పన్నులు కూడా వేయలేదన్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిఐటియు కాలనీలో తాగునీరు పైపులైన్లు, సిమెంటు రోడ్లు, డ్రెయినేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి సభ్యులు మారుతీప్రసాద్‌, కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, ఓబులేసు, ఎస్కేయం బాషా, అబ్దుల్లా, జాకీర్‌, షబ్బీర్‌, సూరి, కార్యదర్శులు ఖాదర్‌బాషా, ప్రసాద్‌, సూరి, రవి, సిఐటియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

➡️