హింస రహిత సమాజాన్ని నిర్మించుకుందాం

సమావేశంలో మాట్లాడుతున్న డా||ప్రసూన

        అనంతపురం కలెక్టరేట్‌ : మహిళలపై దాడులు, హింస పెరిగిపోయింది. ప్రభుత్వాలతో పాటు సమిష్టిగా హింస రహిత సమాజాన్ని నిర్మించుకుందామని ఐద్వా నాయకురాలు డాక్టర్‌ ప్రసూన తెలిపారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో నారాయణ కళాశాలలో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం నాడు సెమినార్‌ నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌కు ముఖ్య వక్తగా డాక్టర్‌ ప్రసూన హాజరై మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో కళాశాలల్లో విద్యార్థులకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 25వ తేదీ నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని, హింసలేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ జిల్లాలో ఆత్మకూరు మండలం, తలుపురు గ్రామంలో స్కూల్లో చిన్న పిల్లలపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఈ మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చిందన్నారు. ఆ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. గత వారం క్రితం ఎర్రనాల కొట్టాలలో ఒక ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అధికారులకు పట్టుబడ్డారన్నారు. ఓ మైనర్‌ బాలికపైనా దాడి జరిగిందన్నారు. ఇలా మహిళలపై అనేక దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయన్నారు. వీటిని నియంత్రించేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు రామాంజనమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్‌, నగర అధ్యక్ష కార్యదర్శులు భీమేష్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

➡️