‘కూటమి’దే అధికారం

వచ్చేది 'కూటమి'దే అధికారం

సమావేశంలో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం

వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం రాయదుర్గంలోని సీతారామాంజనేయ సత్రంలో కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిజెపి, జనసేన, టిడిపి కూటమిగా ఏర్పడినట్లు తెలిపారు. కూటమి అభిప్రాయాలు తెలుసుకుని వాటిని అమలు చేయాలని, అందరినీ కలుపుకుని వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేయాలన్నారు. కూటమిలో పని చేసిన వారికి గుర్తింపు గౌరవం ఉంటుందన్నారు. ప్రత్యర్థికి అవసరమైన అర్హత లేవన్నారు. కేవలం ధనం మీదనే ఆధారపడి పోటీ చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ నాలుగు నెలల్లో వైసిపి నుంచి 3000 కుటుంబాలు టిడిపిలో చేరాయన్నారు. 1994లో జరిగిన ప్రభంజనం తిరిగి పునరావృతం అవుతుందన్నారు. మోడీ దేశ, విదేశాల్లో విశేష ఆదరన ఉందన్నారు. ఇక జనసేన నాయకులు పవన్‌కళ్యాణ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగమే చేశారని కొనియాడారు. ఎన్నికల అనంతరం డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడి విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. జనసేన నాయకులు మంజునాథ్‌గౌడ్‌ మాట్లాడుతూ జగన్‌ సర్కార్‌ హయాంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహించినప్పుడు రాయదుర్గంలో 90 శాతం అభివృద్ధి జరిగితే వైసిపి అధికారంలోకి వచ్చాక అరకొర పనులు కూడా నిలిచిపోయాయన్నారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇనాయత్‌బాషా, బిజెపి రాయదుర్గం పట్టణ అధ్యక్షులు అంబాజీరావు, నాయకులు హీరోజీరావు, వసుంధర, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️