వరదహస్తం కథలసంపుటి ఆవిష్కరణ

గండ్లూరి పంకజమ్మ వరదహస్తం కథలసంపుటిని ఆవిష్కరిస్తున్న సాహితీ వేత్తలు

      అనంతపురం కలెక్టరేట్‌ : శాంతియుతమైన చక్కని సమాజం ఏర్పడాలనే కోరికతో, అనంత రచయిత్రి గండ్లూరి పంకజమ్మ రాసిన ”వరద హస్తం” కథల సంపుటిని గురువారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆవిష్కరించారు. స్పందన అనంత కవుల వేదిక ప్రధాన కార్యదర్శి వి.చంద్రశేఖరశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. పంకజమ్మ రాసిన కథలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన కథలని తెలియజేశారు. సీనియర్‌ రచయిత్రి జి.నిర్మలారాణి వరద హస్తంలోని కథలను వివరించారు. మధ్యతరగతి జీవితంలో మనుషుల తీరుతెన్నులు, సమాజ పోకడలను యథాతథంగా పంకజమ్మ చిత్రీకరించారని విశిష్ట అతిథిగా పాల్గొన్న డా||కోడూరి విష్ణునందన్‌ అభిప్రాయపడ్డారు. విశిష్ట అతిథి, ప్రముఖ విమర్శకులు రాజారామ్‌ మాట్లాడుతూ మంచి ఎత్తుగడ, మంచి కొనసాగింపు, మంచి ముగింపు, సజీవ పాత్రలతో నిండిన ఈ కథలకు శిల్ప చాతుర్యం తోడైతే మరింత గొప్ప కథలుగా రాణించేవి అని సూచనప్రాయంగా తెలియజేశారు. పుస్తకాన్ని సమీక్ష చేసిన జి.యమునారాణి, జి.పేరిందేవి ఈ కథలన్నిటినిండా మహిళా ఔన్నత్యం చిత్రీకరింపబడిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా||పి.శ్రీదేవి, టివి.రెడ్డి, అశ్వర్థ రెడ్డి, ఎఎ.నాగేంద్ర, శేషాచార్యులు, అమరనాథరెడ్డి, షేక్‌ నబీరసూల్‌, జయసింహ, జెట్టి జయరాం, గోవిందరాజులు, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, షరీఫ్‌, మురళి, రియాజుద్దీన్‌, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

➡️