ప్రజారోగ్యంపై ప్రభుత్వ బాధ్యత పెరగాలి

ప్రజారోగ్యంపై ప్రభుత్వ బాధ్యత పెరగాలి

ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో మాట్లాడుతున్న డాక్టర్‌ కొండయ్య

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ప్రజారోగ్యంపై ప్రభుత్వ బాధ్యత మరింత పెరగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రంపచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలోని ఐఎంఎ హాలులో చర్చా వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్‌ కొండయ్య మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం ప్రకారం ‘నా ఆరోగ్యం నా హక్కు’ అన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో జిడిపిలో కనీసం 6 శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రస్తుతం 70 శాతం ప్రయివేటు వైద్యుల చేతుల్లో ఉందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ, బీమా అంటూ కేవలం ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా సామాన్యుడికి కావాల్సింది బీమా కాదని, సరైన జీవన విధానం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ అన్నారు. వీటిపై ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నాయన్నది చాలా ముఖ్యమన్నారు. ఇటీవల షుగర్‌, బిపి, థైరాయిడ్‌, క్యాన్సర్‌, ఫ్యాటీ లివర్‌, బ్రెయిన్‌ స్ట్రోక్‌, ఊబకాయం, పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనత వంటి దీర్ఘకాలిక రోగాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటిలో ముఖ్యంగా టిబి వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రులు, బయటా మందులు దొరకకపోవడం వల్ల అనేకమంది పేదలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కరోనా వైరస్‌ సమయంలో ఐసోలేషన్‌ సెంటర్లు, వైద్య సదుపాయాలు, కరపత్రాల ద్వారా అవగాహన కల్పించినట్లు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి జిడిపిలో 6శాతం ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి, అన్నిరకాల వైద్య సేవలను మెరుగు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ ప్రసూన, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ వీరభద్రయ్య, రాష్ట్ర నాయకులు ఎజి.రాజమోహన్‌, టిడిపి నాయకులు ప్రసాద్‌ రాజారావు ఆదినారాయణ, కాంగ్రెస్‌ నాయకులు దాదా, సిపిఐ నాయకులు జాఫర్పాల్గొన్నారు. ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్‌ మనోరంజన్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ అభిషేక్‌రెడ్డి, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ, జన విజ్ఞాన వేదిక, సిఐటియు, ఆశా, అంగన్వాడీ, ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రక్తదాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️