‘కూటమి’ అభ్యర్థులను గెలిపించుకుందాం

'కూటమి' అభ్యర్థులను గెలిపించుకుందాం

కార్యక్రమంలో మాట్లాడుతున్న గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి-గుంతకల్లు

చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకుని సమిష్టిగా పని చేసి ఎన్‌డిఎ కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని టిడిపి 5వ జోన్‌ ఎన్నికల పరిశీలకులు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మాజీమంత్రి నిమ్మల కిష్టప్ప, నియోజకవర్గ ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్‌ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలని కసాపురం రోడ్డులోని ఓ ఫ్యాంక్షన్‌ హాలులో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో భూకబ్జాలు, అక్రమ కేసులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, ఆస్తి పన్నులతో పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోయారన్నారు. ఈ సమయంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమం కావాలంటే చంద్రబాబు సిఎం కావాలన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలన్నారు. కేవలం 25 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇంటింటికీ వెళ్లి టిడిపి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అదేవిధంగా వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసి వారిని తమ ఓటర్లుగా మలచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్‌, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టిడిపి అభ్యర్థి గుమ్మానూరు జయరామ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పని చేస్తానన్నారు. చంద్రబాబును సీఎంగా చేసుకోవడానికి కలిసికట్టుగా పని చేద్దామన్నారు. సిఎం జగన్‌ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని, మరో 25 రోజుల్లో సైకిల్‌ గుర్తుకు బటన్‌ నొక్కి ఇంటికి పంపుతారన్నారు. ఈ సమావేశంలో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల, పట్టణ ప్రాంతాల టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️