మండల పరిషత్‌ గదిని ఖాళీ చేయాలి

రాజేష్‌కు నోటీస్‌ అందజేస్తున్న ఎంపిడిఒ అల్లాబకష్‌

ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌

మండల పరిషత్‌ కార్యాలయానికి సంబంధించిన కాంప్లెక్స్‌లోని ఓ గదిలో అక్రమంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్న రాజేష్‌, ప్రతాప్‌రెడ్డికి ఎంపిడిఒ అల్లాబకాష్‌ మంగళవారం నోటీసులు జారీ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయానికి సంబంధించిన 8 వాణిజ్య గదులను జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ రమణారెడ్డి సోమవారం పరిశీలించగా వాణిజ్య గదుల్లో అక్రమంగా కార్యాలయాలు, వ్యాపారాలు నిర్వహిస్తుండడాన్ని గమనించి ఏడు గదులను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ గదిని మాత్రం సీజ్‌ చేయకుండా వదిలేశారు. ఈ విషయమై ప్రజాశక్తి పత్రికలో మంగళవారం ‘దుర్గం మండల పరిషత్‌ గదులు సీజ్‌.. ఒక గదికి మినహాయింపు’ అంటూ కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్రమంగా ఉపయోగించుకుంటున్న గదిని ఖాళీ చేయాలని ఎంపిడిఒ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండల పరిషత్‌ కార్యాలయానికి సంబంధించిన వాణిజ్య గదులను అధికారికంగా ఎవరికీ కేటాయించలేదన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నోటీస్‌ జారీ చేసి మూడు రోజుల గడువు ఇచ్చామన్నారు. గదిని ఖాళీ చేయని పక్షంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. మిగిలిన ఏడు గదుల షట్టర్లకు మండల పరిషత్‌ కార్యాలయం సంబంధించిన గదులను అధికారికంగా ఎవరికీ కేటాయించలేదని నోటీస్‌ కాగితం అతికించారు. ఎంపిడిఒ వెంట రంగనాయకులు, ఎఒ చిక్కన్న, సీనియర్‌ అసిస్టెంట్‌ రవిచంద్ర ఆజాద్‌, పంచాయతీ కార్యదర్శులు వేణు, అశోక్‌, బసవరాజు తదితరులు ఉన్నారు.

➡️