కాంగ్రెస్‌తోనే పేదలకు సమన్యాయం

కాంగ్రెస్‌తోనే పేదలకు సమన్యాయం

మహిళకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

రాష్ట్రంలోని పేదలకు సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం ఉరవకొండ పట్టణంలోని గుంతకల్లు రోడ్డు, నెహ్రూ కాలనీ, సత్యనారాయణపేట, పాతపేటతోపాటు వజ్రకరూరు మండల పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు గ్రామాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరిగి గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పథకాలను గుర్తు చేస్తూ పదేళ్లలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు అవలంభించిన వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలంటే కేంద్రంతోపాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. కావున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాగా మధుసూదన్‌రెడ్డి గెలుపు కోసం తనయుడు తనయుడు అవినాష్‌రెడ్డి ఉరవకొండ మండల పరిధిలోని నింబగల్లు, రేనిమాకులపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఒకసారి అవకాశం ఇచ్చి తమ నాన్నను గెలిపించాలని అభ్యర్థించారు.

➡️